ఆ మాటలు కేసీఆర్‌కూ వర్తిస్తాయి.. రఘునందన్ రావు హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-02 10:33:19  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆ మాటలు కేసీఆర్‌కూ వర్తిస్తాయి.. రఘునందన్ రావు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదట బీజేపీ నేతల ఫోన్లనే ట్యాప్ చేశారని ఆరోపించారు. సంఘ విద్రోహ శక్తులు ఫోన్లను ట్యాప్ చేసినట్లు బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు.. అసలు మా ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రాంచందర్ రావు సీరియస్ అయ్యారు. మా ఫోన్లు ట్యాప్ చేసి.. ఉల్టా మాపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) మాట్లాడుతూ... ఎవరు తప్పు చేసినా జైలుకు పంపుతామని గతంలో కేసీఆర్ అన్నారు.. ఆ మాటలు కేసీఆర్‌కూ వర్తిస్తాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిపై జాలి చూపొద్దని.. దోషులను తప్పకుండా జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు.

విమర్శించే వాళ్లంతా మూర్ఖులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను విమర్శించే మూర్ఖులంతా అంధులేనని ఎంపీ రఘునందన్ విమర్శించారు. ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సున్నా అని ఒక్కొకరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. ఒకే కుటుంబం నుంచి ఒక్కొక్కరు ఒక తీరుగా వ్యాఖ్యానిస్తున్నారు. బడ్జెట్‌పై ఒక దిక్కు కేటీఆర్.. ఇంకో దిక్కు హరీశ్‌రావు, కవిత మాట్లాడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో దక్షిణ భారతదేశానికి 7 హైస్పీడ్ రైళ్లు కేటాయిస్తే అందులో హైదరాబాద్‌కు మూడు హైస్పీడ్ రైళ్లు కేటాయించడం జరిగింది. ఈ విషయం.. బావబామ్మర్దులకు కనిపించడం లేదా?, గత బడ్జెట్ కంటే రైల్వే రంగానికి ఈసారి 15 శాతం ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు సున్నా అని చెబుతున్నరాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓసారి బడ్జెట్‌ను పరిశీలించాలి. గతంలో కంటే ఈసారి రూ.1300 కోట్లు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేటాయించారు’ అని రఘునందన్‌ రావు స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అనుమానితుడా? నిందితుడా?

Next Story