- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి బొగ్గు నాణ్యతపై రాజీ లేదు : సీఎండీ బుద్దప్రకాష్ జ్యోతి
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు, ప్రకటించిన గ్రేడ్‌కు అనుగుణంగా నాణ్యమైన బొగ్గును నిరంతరాయంగా సరఫరా చేయడానికి సింగరేణి సంస్థ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది.

- ఉత్పత్తి నుంచి డిస్పాచ్ వరకు ప్రత్యేక పర్యవేక్షణ
- ఏరియాల వారీగా స్పెషల్ అధికారుల నియామకం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు, ప్రకటించిన గ్రేడ్‌కు అనుగుణంగా నాణ్యమైన బొగ్గును నిరంతరాయంగా సరఫరా చేయడానికి సింగరేణి సంస్థ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు ఏరియాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ సింగరేణి సీఎండీ బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాలు జారీ చేశారు. రానున్న మూడు నెలల పాటు ఈ ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, గ్రేడ్ పరిరక్షణ, డిస్పాచ్, ఉత్పాదకత, పనితీరు మెరుగుదల, ఏరియాలు-కార్పొరేట్ విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం, అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించనున్నారు. శనివారం సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, గ్రేడ్ పరిరక్షణ, డిస్పాచ్ అంశాలపై సీఎండీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ పర్యవేక్షణ బాధ్యతల్లో భాగంగా డైరెక్టర్ (ఆపరేషన్స్)కు సత్తుపల్లి, ఇల్లందు ఏరియాలు, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్)కు మణుగూరు, భూపాలపల్లి ఏరియాలు, డైరెక్టర్ (ఫైనాన్స్)కు బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలు కేటాయించారు. అలాగే డైరెక్టర్ (ఈ అండ్ ఎం)కు ఆర్జీ-1, ఆర్జీ-3 ఏరియాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్)కు ఆర్జీ-2, నైనీ ఏరియాలు, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)కు శ్రీరాంపూర్, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలను స్పెషల్ ఆఫీసర్లుగా కేటాయించినట్లు సీఎండీ వెల్లడించారు.
బొగ్గు నాణ్యతే సింగరేణికి గుర్తింపు
సింగరేణి బొగ్గు నాణ్యతే సంస్థకు గుర్తింపని, దానిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని సీఎండీ స్పష్టం చేశారు. కొన్ని ఏరియాల్లో అన్‌గ్రేడెడ్ బొగ్గు, షేల్ కలవడం వల్ల నాణ్యత పడిపోతుందని అధికారులు పేర్కొనగా, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్షిక కోల్ గ్రేడేషన్ ప్రణాళిక ప్రకారం సీమ్‌ల వారీగా బొగ్గు తవ్వకాలు తప్పనిసరిగా చేపట్టాలని, ప్రకటించిన గ్రేడ్‌కు అనుగుణంగానే ఉత్పత్తి జరగాలని ఆదేశించారు. ఆఫ్‌లోడింగ్ ప్రాంతాల్లో బ్లాస్టింగ్‌కు ముందు బొగ్గు బెంచీలను పూర్తిగా శుభ్రం చేయాలని, బొగ్గు బెంచీలు, ఓవర్ బర్డెన్ బెంచీల మధ్య తగినంత దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాయి, షేల్ పొరలను బొగ్గుతో కలపకుండా ప్రత్యేకంగా తవ్వి ఓవర్ బర్డెన్‌లోనే డంప్ చేయాలని, బొగ్గు గ్యాలరీల శుభ్రత, ఫైరీ కోల్ నిర్వహణకు రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. అన్ని ఓపెన్‌కాస్ట్ గనులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో తగిన సంఖ్యలో క్రషర్లు ఏర్పాటు చేసి, అవి ఎప్పటికప్పుడు సక్రమంగా పనిచేసేలా నిర్వహించాలని సూచించారు. ప్రతి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో రోజువారీ, గ్రేడ్‌వారీ బొగ్గు డిస్పాచ్ ప్రణాళికను ముందుగానే రూపొందించి అమలు చేయాలని, ఉత్పత్తి నుంచి డిస్పాచ్ వరకు ప్రతి దశలో నాణ్యత నియంత్రణకు అధికారులు వ్యక్తిగత బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. సింగరేణి బొగ్గు నాణ్యతపై వినియోగదారులకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి అధికారి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఎం.తిరుమలరావు, ఈడీ బి.వెంకన్న, జీఎం టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






