‘నువ్వు వెయ్యి జన్మలు ఎత్తినా నేను చావను నా కొడకా’.. CM రేవంత్‌కు కేసీఆర్ హెచ్చరిక

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-20 15:03:14  IST  )

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగ ప్రసంగం

‘నువ్వు వెయ్యి జన్మలు ఎత్తినా నేను చావను నా కొడకా’.. CM రేవంత్‌కు కేసీఆర్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: "తెలంగాణ గడ్డపై గంజి కేంద్రాలు నడిచిన రోజులు చూశాం.. కరెంట్ కోసం బషీర్‌బాగ్‌లో మన పిల్లలు ప్రాణాలిస్తుంటే చలించి ఉద్యమానికి వచ్చాను.. నన్ను బాడీ షేమింగ్ చేసినా, హేళన చేసినా పక్షిలా రాష్ట్రమంతా తిరిగి తెలంగాణ సాధించాను" అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగ ప్రసంగం చేశారు. సోమవారం జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాకముందున్న దుస్థితిని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. పాలమూరు నుంచి 90 శాతం వలసలు ఉండేవని, తిండి లేక, పని లేక ప్రజలు దేశాలు దాటి వెళ్లేవారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచితే నిరసన తెలిపిన వారిని కాల్చి చంపిన ఘటన తనను ఉద్యమం వైపు నడిపించిందని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంట్ ఇచ్చి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టామని గర్వంగా ప్రకటించారు.

పాలన గాలికి.. కేసీఆర్ చావే లక్ష్యమా?

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తులం బంగారం, స్కూటీలు, పెంచిన పెన్షన్లు, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుబంధు, దళితబంధులను గాలికి వదిలేసి రైతులను, పేదలను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు పాలన వదిలేసి కేసీఆర్ చావాలి అని కోరుకుంటున్నారు. వెయ్యి జన్మలెత్తినా నేను చావను నా కొడకా.. అంటూ అత్యంత ఘాటుగా స్పందించారు. అభివృద్ధి ముచ్చట లేదని, కేవలం పాలకుల చిల్లర మాటలు తప్ప రాష్ట్రంలో ఏమీ జరగడం లేదని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. "మొన్న కేవలం 1.7 శాతం ఓట్లతోనే ఓడిపోయాం. ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నైజాన్ని గ్రహిస్తున్నారు. మళ్లీ బరాబర్ మనమే అధికారంలోకి వస్తాం.. ఈసారి బంపర్ మెజార్టీతో వస్తాం" అని కేడర్‌లో ఉత్సాహం నింపారు. ఈ సభలో సీనియర్ నేత టీ. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు.

కాంగ్రెస్‌లో క్షోభ భరించలేకే బీఆర్ఎస్‌లోకి.. కారు ఎక్కిన జీవన్ రెడ్డి సభలో సంచలన వ్యాఖ్యలు

Next Story