విద్యార్థుల ఆందోళనలు.. సానియా మీర్జా మద్దతు

by Muthe.Rajitha |

దేశంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైన విద్యార్థుల ఆందోళనలపై భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా స్పందిస్తూ తన పూర్తి మద్దతును ప్రకటించారు.

విద్యార్థుల ఆందోళనలు.. సానియా మీర్జా మద్దతు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైన నీట్ (NEET-UG 2026) పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనలపై భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా స్పందిస్తూ తన పూర్తి మద్దతును ప్రకటించారు. నీట్ వంటి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు ఏళ్ల తరబడి కష్టపడి చదివే విద్యార్థులు, ఈ పరిణామాల వల్ల తీవ్ర మానసిక ఆందోళన, అనిశ్చితిని ఎదుర్కోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "విద్యార్థులే మన దేశ భవిష్యత్తు" అని పేర్కొన్న ఆమె, విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితుల పట్ల తన సానుభూతిని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.

విద్యార్థుల వాదనలను, డిమాండ్లను ప్రభుత్వం ఆలకించాలని, విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం తక్షణమే సమగ్ర సంస్కరణలు చేపట్టాలని సానియా మీర్జా స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, విద్యార్థుల్లో మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అదే సమయంలో, సమాజంలో ఎలాంటి హింసకు తావు లేదని గుర్తుచేస్తూ, దేశ యువత భవిష్యత్తును రక్షించుకోవడానికి అందరూ కలిసికట్టుగా శాంతియుత మార్గంలోనే ఈ సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆమె పిలుపునిచ్చారు.

మరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద క్రాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) నాయకత్వంలో విద్యార్థులు, యువత చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పేపర్ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరులో సమూల మార్పులు తీసుకురావాలని నిరసనకారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

Next Story