కేసీఆర్ ఉద్యమ రథం దారితప్పింది.. కవిత సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-25 05:26:47  IST  )

కేసీఆర్ ఉద్యమ రథం దారితప్పిందని, నిఘా నీడలో తెలంగాణ బతుకుతోందని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఉద్యమ రథం దారితప్పింది.. కవిత సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) శ్రీకారం చుట్టారు. ఇవాళ మేడ్చల్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ముఖ్యంగా తన తండ్రి కేసీఆర్, గత బీఆర్ఎస్ పాలనపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.

దారితప్పిన ఉద్యమ రథం..

కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమ రథం దారితప్పిందని కవిత ఆరోపించారు. సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైందని, ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లయినా ప్రజల కలలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ గారు ఇప్పుడు మన మనిషి కాదు.. ఆయనో మర మనిషి.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన రారు. తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయింది’ అని కవిత ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వ్యక్తిగత స్వేచ్ఛ కరువైందని, ఎవరి ఫోన్ ఎవరు వింటున్నారో అనే భయంతో ప్రజలు బతుకుతున్నారని, దారుణమైన నిఘా నీడలో తెలంగాణ మగ్గిపోయిందని ఆమె మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఒక అమ్మగా పరిణతి చెందాలనుకుంటున్నానని, అమ్మతనంతో పనిచేస్తే బిడ్డలకు ఏ కష్టమొచ్చినా అడ్డుకోవచ్చని ఆమె భావోద్వేగానికి కవిత లోనయ్యారు.

తొలి ముఖ్యమంత్రి ఏం చేశారు..?

తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు గర్వపడుతున్నా.. కానీ ఆనాడు పాలించిన కుటుంబంలో భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోల్చిన బీజేపీ ఎంపీపై ఆమె మండిపడ్డారు. మెడ మీద తలలేని ఎంపీలు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే, రాష్ట్రంలోని బీజేపీ బానిస ఎంపీలు నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. తొలి ముఖ్యమంత్రి పాలనలో పదేళ్లలో రూ. 1.89 లక్షల కోట్లు ఖర్చు చేసినా, కేవలం 18 లక్షల ఎకరాలకే నీళ్లిచ్చారని ఆమె విమర్శించారు. సింగరేణి అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతూనే, కార్మికుల పక్షాన పోరాడతానని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.

చివరకు నన్నే సస్పెండ్ చేశారు..

పాత కేసీఆర్ అయ్యింటే ఈపాటికి పాలమూరు ప్రాజెక్టును కట్టించేవారని కవిత అన్నారు. కానీ, మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు, జాతీయ పార్టీ పెడతామన్నారని కామెంట్ చేశారు. ఒకప్పుడు సింగరేణి గనిలో కార్మికుడు చనిపోతే పరిగెత్తుకెళ్లి పరామర్శించే వ్యక్తి.. నేడు ప్రజల కష్టాలను పట్టించుకోవడం మానేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడారంటే ఏదో అనుకోవచ్చు, ఆయనకు రాజకీయం అస్సలు తెలియదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక కర్కోటకుడి పాలన నడుస్తోందని, ప్రజల ఇళ్లను కూల్చుతుంటే ఆదుకోవాల్సిన ‘అమ్మ’ లాంటి కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్‌లో మార్పు వస్తుందేమోనని తాను చాలా కాలం వేచి చూశానని అన్నారు. కానీ మార్పు రాకపోగా, నన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, తనపై జరిగిన క్రమశిక్షణా చర్యను కవిత గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఆత్మను కాపాడేందుకే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందని, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పురుడు పోసుకున్న కొత్త పార్టీ.. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్ఎస్) పేరుతో వస్తున్న కల్వకుంట్ల కవిత

Next Story