బీఆర్ఎస్‌లో నయా జోష్.. రేపు అధినేత కేసీఆర్ కీలక సమావేశం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-11 14:10:09  IST  )

మరోసారి బీఆర్ఎస్ యాక్టివ్ మోడ్ లోకి వస్తోంది. రేపు ఎర్రవల్లి ఫాంహౌస్ లో కేసీఆర్ పార్టీ లీడర్లతో కీలకంగా సమావేశం కానున్నారు.

బీఆర్ఎస్‌లో నయా జోష్.. రేపు అధినేత కేసీఆర్ కీలక సమావేశం
X
  • పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వంపై నిర్ణయం
  • పార్టీ ఇన్‌చార్జీలను సైతం నియమించనున్న కేసీఆర్
  • పార్టీ బలోపేతంపైనే సీరియస్ డిస్కషన్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మరోసారి యాక్టివ్ మోడ్‌లోకి వస్తున్నది. లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలు కొంత మందగించిన నేపథ్యంలో.. ఇప్పుడు పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. దాంతో పార్టీ కేడర్‌లో జోష్ కనిపిస్తున్నది. ఇటీవలే జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన కేసీఆర్.. కార్యకర్తల్లో తన స్పీచ్‌తో కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు. ఆ తరువాత పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నారు. అందులోభాగంగానే భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరిపేందుకు నేడు ముఖ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, జిల్లా, నియోజకవర్గ స్థాయి ఇన్‌చార్జీల నియామకం, కేడర్ యాక్టివేషన్ వంటి అంశాలపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎట్టకేలకు పార్టీ పునర్వ్యవస్థీకరణ

గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్‌లో కొంత నిరుత్సాహ వాతావరణం నెలకొంది. పలువురు నేతలు పార్టీ మారడం, కొన్ని జిల్లాల్లో కేడర్ సైలెంటుగా మారడం వంటి పరిణామాలు పార్టీని ఆలోచనలో పడేశాయి. అయితే.. ఇటీవల పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌, గ్రామ స్థాయిలో ఇంకా పార్టీకి బలమైన కేడర్ ఉన్నదనే అంచనాలతో కేసీఆర్ మళ్లీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. పార్టీని కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయకుండా, ప్రజా సమస్యలపై పోరాట పార్టీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. అందుకే.. నేడు నిర్వహించే సమావేశంలో ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంపైనే చర్చ జరగనుంది. గతంలో బూత్ స్థాయి వరకు బలమైన నిర్మాణం ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తరువాత పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో మళ్లీ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలను యాక్టివ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, బీసీ వర్గాలను మరింతగా పార్టీలో చేర్చుకునేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. డిజిటల్ మెంబర్‌షిప్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ సభ్యత్వ నమోదు చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

జిల్లా ఇన్‌చార్జీల నియామకంపై ఫోకస్

పార్టీ కార్యకలాపాలు బలహీనంగా ఉన్న జిల్లాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ప్రతి జిల్లాకు ప్రత్యేక ఇన్‌చార్జీలను నియమించి, నెలవారీ రిపోర్టులు తీసుకునే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టంగా మారుతున్న నేపథ్యంలో, వాటిని సమన్వయం చేసే బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించే అవకాశం ఉన్నది. పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటే సభ్యత్వం, కమిటీల నియామకాలను సైతం ఆ ఇన్‌చార్జి నేతృత్వంలోనే చేపట్టేందుకు సిద్ధం అయినట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభాపక్షాల ఉప నాయకులు పాల్గొంటున్నారు. మధ్యాహ్నం లంచ్ అనంతరం జరగనున్న ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్చార్జిల నియామకం సహా పార్టీ బలోపేతం, తదితర ముఖ్య విషయాలపై చర్చించనున్నారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ టెండర్‌లో భారీ కుంభకోణం:మాజీ మంత్రి హరీష్ రావు

Next Story