సింగరేణిని కేసీఆర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-03 07:50:06  IST  )

సింగరేణిని కేసీఆర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)ను లూఠీ చేసిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ దొందూదొందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు గుప్పించారు. ఇవాళ హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తున్న ఆ రెండు పార్టీలకు బీజేపీ (BJP)ని విమర్శించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. నాడు ఒక కుటుంబం దోచుకుంటే.. నేడు దోచుకున్న సొమ్ము కోసం మరో ఫ్యామిలీ కొట్లాడుతోందని అన్నారు. ఇక మంత్రులైతే విచ్చలవిడిగా వాటాల కోసం కయ్యానికి కాలుదువ్వుతున్నారని పేర్కొన్నారు.

సింగరేణికి తీరని అన్యాయం చేశారు..

కానీ, ఒక్కసారి బీజేపీకి అధికారమిస్తే మా పాలన ఏంటో చూపిస్తామని ఆయన అన్నారు. ఎప్పటికైనా తెలంగాణకు రక్షణ బీజేపీయేనని తెలిపారు. అదేవిధంగా సింగరేణి (Singareni) పాలనా వ్యవస్థలో మార్పులు రావాలన్నారు. ఆ సంస్థపై కేంద్రానికి ఎలాంటి అధికారాలు లేవని క్లారిటీ ఇచ్చారు. సింగరేణికి రాష్ట్రం నుంచి రూ. 51 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు సింగరేణికి తీరని అన్యాయం చేశాయని తెలిపారు. సింగరేణిని గత ప్రభుత్వం కేసీఆర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చారని ఎద్దేవా చేశారు. దీనివల్ల ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని గద్దె దించుతామని కమ్యూనిస్టులు స్టేట్‌మెంట్లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఉన్న ఒక్క ఎంపీతో అది సాధ్యమా అని ప్రశ్నించారు. ముందు కమ్యూనిస్టులు తమ పార్టీని కాపాడుకుంటే బెటర్ అని కిషన్ రెడ్డి చురకలంటించారు.

హైదరాబాద్-యాదగిరి‌గుట్ట MMTS మూడో ఫేజ్‌పై బిగ్ అప్‌డేట్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

Next Story