విద్యార్థులపై లాఠీచార్జ్ హేయం.. కేంద్రంపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం

by Ramesh Naini |

విద్యా విధానంలోని లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ప్రయోగించడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు.

విద్యార్థులపై లాఠీచార్జ్ హేయం.. కేంద్రంపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యా విధానంలోని లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ప్రయోగించడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే చోటుచేసుకున్న ఈ ఘటనపై పార్లమెంట్ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

విద్యార్థులే దేశ భవిష్యత్తు

పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యార్థులు మన పిల్లలు.. దేశ భవిష్యత్తు. ఈ పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకేతం, అది విద్యార్థులదే తప్ప ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు.’ అని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా రంగ సమస్యలపై రాహుల్ గాంధీ చాలాకాలంగా పోరాడుతున్నారని గుర్తుచేశారు. విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా చర్చ జరపాల్సింది పోయి, వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించి కొట్టడం దారుణమన్నారు.

కాగా, కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపు మేరకు పార్లమెంట్‌ మార్చ్‌కు బయలుదేరిన విద్యార్థులు, నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. బారికేడ్లను దాటుకుని సెంట్రల్ ఢిల్లీలోకి ప్రవేశించేందుకు యత్నించిన నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు బలప్రయోగం చేశారు. దీంతో పటేల్ చౌక్, శాస్త్రి భవన్, పార్లమెంట్ స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పాటు పలువురు విద్యార్థులు, పోలీసులకు గాయాలయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు సమాచారం. కాగా, విద్యార్థులపై లాఠీచార్జ్ అంశంపై ఉభయ సభల్లోనూ విపక్షాలు తీవ్ర నిరసన తెలపడంతో పార్లమెంట్ కార్యకలాపాలు పలుమార్లు వాయిదా పడ్డాయి.

Next Story