ఆ దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఒక్కడే.. రేవంత్‌తోని ఏమీ అవ్వదు : కేటీఆర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-29 09:15:19  IST  )

మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతుబంధు, దళితబంధు చేయాలంటే దమ్ముండాలన్నారు.

ఆ దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఒక్కడే.. రేవంత్‌తోని ఏమీ అవ్వదు : కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు రాగానే ప్రజలు కన్ఫ్యూజ్ కావొద్దని, గందరగోళంలో ఓటేస్తే భవిష్యత్తు ఆగమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రాజకీయాల్లో అధికారం రావడం, పోవడం అనేది చాలా సాధారణమని, అది రొటీన్‌గా జరిగే ప్రక్రియేనని ఆయన వ్యాఖ్యానించారు. పాలమూరు బిడ్డను అని, ప్రజల గోస తీరుస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఈ రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి లేదా పాలమూరు ప్రాంతానికి ఏం చేశారో ప్రజలు లోతుగా ఆలోచించాలని కోరారు. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి సాగిస్తున్న పాలనను బేరీజు వేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

420 అబద్ధపు హామీలు లేవు.. కేసీఆర్ మార్క్ అంటే భరోసా

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన నాయకుడు కేసీఆర్ అని, ఆయన కాంగ్రెస్ లాగా 420 అబద్ధపు హామీలతో ప్రజలను ఎప్పుడూ మోసం చేయలేదని కేటీఆర్ తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా రైతుల సంక్షేమం కోరి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, 11 విడతల్లో దాదాపు రూ.73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. గతంలో కొందరు నేతలు రైతుబంధు కేసీఆర్ తన ఇంట్లో నుంచి ఇస్తున్నారా అని హేళనగా మాట్లాడారని, మరి ఇవాళ రాష్ట్రంలో రైతుబంధు పరిస్థితి ఏమైందో వారు సమాధానం చెప్పాలని నిలదీశారు. కత్తి వాళ్లకిచ్చి, యుద్ధం మాత్రం మమ్మల్ని చేయమంటే ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

ఖలేజా ఉన్న నాయకుడే పథకాలను అమలు చేయగలరు

రాష్ట్రంలో ప్రస్తుతం బిడ్డ పెళ్లి చేయాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా సామాన్యుడి దగ్గర చిల్లిగవ్వ లేని పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతుంటే వారికి కోపం రావడం సహజమని, నేడు తెలంగాణలో అదే జరుగుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డికి, తనకు మధ్య వ్యక్తిగత పంచాయతీలు ఏవీ లేవని, కానీ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినందునే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ కేవలం రైతుబంధు మాత్రమే కాకుండా, దళితబంధు వంటి సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని, అటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే నాయకుడికి 'ఖలేజా' ఉండాలి అని, అది కేసీఆర్‌లో మాత్రమే ఉందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ లో వైఫల్యం.. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎండగడుతూ, ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ. 6 లక్షలు ఇస్తామన్న మాట ఏమైందని కేటీఆర్ నిలదీశారు. విద్యార్థులకు 10వ తరగతి పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.12 వేలు డిగ్రీ పాసైతే రూ.లక్ష, పీజీ పాసైతే రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా కాంగ్రెస్ సరిగ్గా నిర్వహించలేకపోతోందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఆరున్నర లక్షల మంది విద్యార్థుల కోసం లక్షల రూపాయల ఫీజులు ప్రభుత్వం చెల్లించిందని, కానీ నేడు ఆ ఫీజులు తల్లిదండ్రులే కట్టుకోవాలని కోర్టులు తీర్పునిచ్చే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా శక్తికి కేసీఆర్ జై.. ఇందిరా, సోనియా, ప్రియాంకలపై ప్రశంసల జల్లు!

Next Story