ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

by Taduka Kalyani |

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేపడుతున్న మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్య వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
X

దిశ, కొత్తగూడెం: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేపడుతున్న మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్య వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కళాశాలల్లో కొనసాగుతున్న పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు రూ.3.31 కోట్ల వ్యయంతో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యుదీకరణ, మరుగుదొడ్ల మరమ్మతులు, నూతన తరగతి గదుల నిర్మాణం, భవనాల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను కళాశాలల వారీగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కళాశాలల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మరమ్మతు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కళాశాలల వారీగా విద్యార్థుల చేరికలు, ఇంటర్మీడియట్ ఫలితాలు, ఉత్తీర్ణత శాతంపై ప్రిన్సిపాళ్లతో చర్చించారు. ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు చర్యలు చేపట్టడంతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్న సౌకర్యాలు, అవకాశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story