మిల్లర్ల ‘బియ్యం’ కుంభకోణం

by Batti.Sumithra |

ప్రభుత్వానికి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అందజేసే విషయంలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు రైస్ మిల్లర్లు వేస్తున్న ఎత్తుగడలకు ప్రభుత్వం చెక్ పెడుతోంది.

మిల్లర్ల ‘బియ్యం’ కుంభకోణం
X

దిశ, కాటారం : ప్రభుత్వానికి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అందజేసే విషయంలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు రైస్ మిల్లర్లు వేస్తున్న ఎత్తుగడలకు ప్రభుత్వం చెక్ పెడుతోంది. రాజకీయ అండదండలతో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడి, అధికారుల సహకారంతో ప్రభుత్వాన్ని మోసం చేయడం పరిపాటిగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు మిల్లర్ల పై కేసులు నమోదయ్యాయి. కొందరు అధికారులకు తప్పుడు సమాచారం అందించడం, మరికొందరు కోర్టులను ఆశ్రయించి చర్యల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యం అందకపోవడంతో పాటు కోట్లాది రూపాయల బకాయిలు కూడా వసూలు కాకపోవడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో సీఎంఆర్ వ్యవహారంలో అధికారులు పోలీసులను ఆశ్రయించి కేసులు నమోదు చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేస్తున్నారు.

దీంతో రైస్ మిల్లర్లలో కలకలం రేగుతోంది. తాజాగా కాటారం మండలంలోని దామరకుంట గ్రామంలో రూ.4.29 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు కేసు నమోదు చేసి రైస్ మిల్లు యజమానిని అరెస్టు చేశారు. ఈ ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. కాటారం సీఐ నాగార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం, దామరకుంట గ్రామంలోని రుద్ర రైస్ మిల్లు యజమాని చీర్ల రవికాంత్‌ను మంగళవారం అరెస్టు చేశారు. 2022–23 రబీ, ఖరీఫ్ సీజన్లకు సంబంధించి సుమారు 38 వేల క్వింటాళ్ల వరిని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా సీఎంఆర్ బియ్యం తయారీ కోసం ఆయనకు అప్పగించారు. అయితే, మిల్లింగ్ అనంతరం ప్రభుత్వానికి అందజేయాల్సిన బియ్యాన్ని రవికాంత్ అప్పగించలేదు. దీంతో ఆ వరి విలువ సుమారు రూ.4.29 కోట్లు ఉంటుందని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్ సీతా రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు 2024లో అప్పటి ఎస్సై అభినవ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన కాటారం సీఐ నాగార్జునరావు బృందం, మంగళవారం చింతకాని క్రాస్ వద్ద కోర్టుకు వెళ్తున్న నిందితుడు చీర్ల రవికాంత్‌ను అరెస్టు చేసి, అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

Next Story