రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్: ‘పీఎం కిసాన్’ డబ్బులపై కేంద్రం కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

అన్నదాతల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 23వ విడత నిధులు జమ చేసేందుకు కేంద్రం డేట్ ఫిక్స్ చేసింది.

రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్: ‘పీఎం కిసాన్’ డబ్బులపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం (Govt. Of India) తీపి కబురు చెప్పింది. రైతాంగానికి పెట్టుబడి సాయంగా అందిస్తున్న ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (PM KISAN) 23వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల జూన్ 20న దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లోకి నిధులను నేరుగా విడుదల చేయబోతున్నట్లుగా కేంద్రం అధికారికంగా ప్రకటించింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏటా ప్రతి రైతు కుటుంబానికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అందించే 23వ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది.

‘ఈ-కేవైసీ’ ఉంటేనే డబ్బులు జమ..

పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ డబ్బులు జమ కావాలంటే ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోయినా, కేవైసీ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నా నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులు వెంటనే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా సమీపంలోని మీ‌సేవా, సీఎస్సీ (CSC) కేంద్రాలకు వెళ్లి తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

Next Story