SpaceX: స్పేస్‌ఎక్స్ రాకెట్ ర్యాలీ

by S Gopi |

ఇది ఐపీఓ ధర 135 డాలర్ల కంటే 62 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ అద్భుతమైన ర్యాలీతో స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ ఏకంగా 2.85 ట్రిలియన్లకు (సుమారు రూ. 238 లక్షల కోట్లు) చేరుకుంది.

SpaceX: స్పేస్‌ఎక్స్ రాకెట్ ర్యాలీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే చరిత్ర సృష్టించింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు ఏకంగా 14 శాతానికి పైగా దూసుకెళ్లి 220 డాలర్ల మార్కును తాకాయి. ఇది ఐపీఓ ధర 135 డాలర్ల కంటే 62 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ అద్భుతమైన ర్యాలీతో స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ ఏకంగా 2.85 ట్రిలియన్లకు (సుమారు రూ. 238 లక్షల కోట్లు) చేరుకుంది. ఫలితంగా, 2.64 ట్రిలియన్ డాలర్ల విలువైన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ను స్పేస్‌ఎక్స్ వెనక్కి నెట్టేసింది. అంతేకాదు, ఒక దశలో 2.92 ట్రిలియన్ డాలర్ల విలువైన సాఫ్ట్‌వేర్ మైక్రోసాఫ్ట్‌ను కూడా అధిగమించి కొద్దిసేపు ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ కంపెనీల సరసన నిలిచింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే 9.1 బిలియన్ డాలర్ల విలువైన స్పేస్‌ఎక్స్ షేర్లు చేతులు మారాయి. ఇది ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, టెస్లా, యాపిల్ కంపెనీల మొత్తం ట్రేడింగ్ వాల్యూమ్ కంటే చాలా రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దీంతో ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో స్పేస్‌ఎక్స్ టాప్-5లో చోటు సంపాదించింది. షేర్లపై ఆప్షన్స్ ట్రేడింగ్ ప్రారంభం కావడం, అలాగే త్వరలో ప్రధాన స్టాక్ ఇండెక్స్‌ల్లో చేరే అవకాశం ఉండటం పెట్టుబడిదారుల కొనుగోళ్లకు మరింత ఊతమిచ్చాయి.

Next Story