- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రా అధికారులు సూపర్ కాప్స్ ఏం కాదు
హైడ్రా అధికారులు ప్రభుత్వ యంత్రాంగంలో సూపర్ కాప్స్ ఏమీ కారని తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో మందలించింది.

దిశ,తెలంగాణ బ్యూరో: చట్ట పరిధిని అతిక్రమించి వ్యవహరించడానికి హైడ్రా అధికారులు ప్రభుత్వ యంత్రాంగంలో సూపర్ కాప్స్ ఏమీ కారని తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో మందలించింది. తాము ఇతరుల కంటే ఒక క్లాస్ అపార్ట్ అని హైడ్రా భావిస్తున్నట్లు కనిపిస్తోందని, కానీ వారు కూడా ప్రభుత్వ వ్యవస్థలో ఒక భాగమేనన్న విషయాన్ని మర్చిపోకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోతుకుంటలోని ఓ ప్రైవేటు ఆస్తిలో ఇకపై జోక్యం చేసుకోబోమని హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ న్యాయస్థానానికి లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో.. ఆ సంస్థ కమిషనర్ ఏ.వి.రంగనాథ్‌పై దాఖలైన రెండు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలను హైకోర్టు మూసివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ అనిల్ కుమార్ జుకంటి కామన్ ఆర్డర్ జారీ చేశారు.
చట్ట పరిమితులు దాటిన దుస్సాహసాలకు హైడ్రా ఒడిగట్టకూడదు..
ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేసేటప్పుడు అధికారులకు ఉత్సాహం ఉండొచ్చని, అయితే ఆ ఉత్సాహం చట్ట పరిమితులకు లోబడి ఉండాలని న్యాయమూర్తి హితవు పలికారు. చట్ట పరిమితులు దాటిన దుస్సాహసాలకు హైడ్రా అధికారులు ఒడిగట్టకూడదని సూచించారు. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రైవేటు ఆస్తిలోకి ప్రవేశించడం ద్వారా హైడ్రా అధికారుల చర్యలు ముమ్మాటికీ చట్టవిరుద్ధమని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. లోతుకుంటలోని సర్వే నంబర్లు 1, 2 లలో ఉన్న తమ భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా తిరుమలగిరి తహసీల్దార్ సహా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోరుతూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2016లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పట్లో విచారణ జరిపిన కోర్టు, పిటిషనర్ ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని 2021లో అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత కూడా అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని సదరు సంస్థ రెండు కేసులు వేసింది. దీంతో వివాదాస్పద ఆస్తిలోకి తాము ప్రవేశించబోమని ఈ ఏడాది 2026 జనవరి 9న అధికారులు కోర్టుకు హామీ ఇచ్చారు.
అయితే, ఆ ప్రైవేటు ఆస్తిలో రాళ్లు ఉన్నాయని సొసైటీ టు సేవ్ రాక్స్ అనే సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ఇటీవల హైడ్రా అధికారులు సదరు స్థలంలోకి ప్రవేశించారు. దీంతో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ తాజాగా హైడ్రా కమిషనర్‌పై రెండు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలను దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ అనిల్ కుమార్ జుకంటి.. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పిటిషనర్ ఆస్తిలోకి ప్రవేశించడంలో హైడ్రా అధికారులు తప్పు చేశారని పేర్కొన్నారు. వారి చర్యలు చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ దశలో హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ స్పందిస్తూ.. ఇకపై లోతుకుంటలోని సదరు సర్వే నంబర్లలో ఉన్న పిటిషనర్ ఆస్తి వ్యవహారాల్లో హైడ్రా అధికారులు ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోరని న్యాయస్థానానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీని రికార్డుల్లో నమోదు చేసుకున్న న్యాయమూర్తి.. హైడ్రా కమిషనర్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.






