- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20 మందిని అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాత మైసంపేట్ గ్రామాన్ని పునరావాసం కోసం తరలించి రెండున్నరేళ్లు గడిచినా, ఇప్పటికీ సాగు భూములు కేటాయించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాత మైసంపేట్ గ్రామాన్ని పునరావాసం కోసం తరలించి రెండున్నరేళ్లు గడిచినా, ఇప్పటికీ సాగు భూములు కేటాయించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గోండుగూడ గ్రామంలోని అటవీ భూములకు హద్దులు చూపించేందుకు ఎఫ్‌డీఓ శివకుమార్, సీఐలు సత్యనారాయణ, సమ్మయ్య ఆధ్వర్యంలో సుమారు 150 మంది పోలీసు సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు పాత మైసంపేట్ పునరావాస గ్రామస్థులకు కేటాయించిన భూములను చదును చేసి హద్దులు నిర్ధారించే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా పక్కనే ఉన్న గోండుగూడ గ్రామస్థులు తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు హద్దులు వేసి వాటిని ఇతరులకు కేటాయించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కూడా ప్రత్యామ్నాయంగా సాగుభూములు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అటవీ శాఖ అధికారులు సుమారు 20 మంది గోండుగూడ గ్రామస్థులను అదుపులోకి తీసుకుని ఇందన్‌పల్లి రేంజ్ కార్యాలయానికి తరలించారు. మరోవైపు, పాత మైసంపేట్ పునరావాస గ్రామస్థులు కూడా ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా సాగుభూములు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారని, తొలుత 94 మంది నిర్వాసితులకు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున భూమి ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం 2.32 ఎకరాలే ఇస్తామని చెప్పడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యను పరిష్కరించలేదని వారు ఆరోపించారు. పునరావాస గ్రామంలో మూడు ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని, బావులు తవ్వించాలని, భూమిలోని రాళ్లు, రప్పలు తొలగించి సాగుకు అనుకూలంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ పనులన్నింటినీ ఐదు రోజుల్లో పూర్తి చేయకపోతే తిరిగి తమ పాత గ్రామానికే వెళ్లిపోతామని పాత మైసంపేట్ గ్రామస్థులు హెచ్చరించారు.






