- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించే బాధ్యత మాది : వరుణ్ రెడ్డి
11 కేవీ, 33 కేవీ ఫీడర్లలో ట్రిప్పింగ్‌లను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ప్రస్తుత విద్యుత్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : 11 కేవీ, 33 కేవీ ఫీడర్లలో ట్రిప్పింగ్‌లను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ప్రస్తుత విద్యుత్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నిర్మల్ అధికారులతో సీఎండీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎండీ మాట్లాడుతూ అవసరమైన చోట మధ్యంతర విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు లైన్‌లలోని లోపాలు సరిదిద్దాలని అన్నారు. నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్ ఉపవిభాగాల సాంకేతిక, వాణిజ్య పనితీరు సూచికలను పరిశీలించి, అవసరమైన చోట పనితీరు మెరుగుదలకు సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన హెచ్‌టీ, ఎల్‌టీ లైన్ విస్తరణలు , అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు.
డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్) వైఫల్యాలను తగ్గించేందుకు అవసరమైన చోట మధ్యంతర స్తంభాలు ఏర్పాటు చేయడం, అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో స్పేసర్లు అమర్చడం, ఓవర్‌లోడ్ అయిన డీటీఆర్‌లను మార్చడం, అలాగే ప్రమాదకర ప్రాంతాల్లోని 11 కేవీ ఫీడర్ల పై లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించాలని ఆదేశించారు. విద్యుత్ పనులు నిర్వహించే సమయంలో ఫీల్డ్ సిబ్బంది తప్పనిసరిగా నిర్దేశిత భద్రతా పరికరాలను ఉపయోగించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించాలని సూచించారు.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను నమోదైన తేదీ నుంచి రెండు నెలల వ్యవధిలోపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సకాలంలో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి అధికారి, సమస్త ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సాంకేతిక ప్రమాణాల పాటింపు, వాణిజ్య పనితీరు మెరుగుదల, వినియోగదారుల సంతృప్తి సంస్థ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నిర్మల్ ఆపరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్, నిర్మల్ డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్), నిర్మల్ టౌన్ , నిర్మల్ రూరల్ ఉపవిభాగాల ఆపరేషన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.






