రెబ్బెన వ్యాపారుల సమస్యల పరిష్కారానికి ఎంపీకి వినతి

by Batti.Sumithra |

రెబ్బెన మండల కేంద్రంలో గత డెబ్బై సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 222 మంది వ్యాపార కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉట్నూర్‌లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నాగేశ్‌కు అఖిలపక్ష నాయకులు వినతిపత్రం సమర్పించారు.

రెబ్బెన వ్యాపారుల సమస్యల పరిష్కారానికి ఎంపీకి వినతి
X

దిశ, రెబ్బెన : రెబ్బెన మండల కేంద్రంలో గత డెబ్బై సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 222 మంది వ్యాపార కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉట్నూర్‌లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నాగేశ్‌కు అఖిలపక్ష నాయకులు వినతిపత్రం సమర్పించారు. రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఏడు ఎకరాల 26 సెంట్ల భూమిని స్థానిక వ్యాపారులకు కేటాయించాలని, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించకూడదని వినతిపత్రంలో కోరారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ రోడ్డు పక్కన నివసిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారులను అధికారులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వ్యాపారాల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న 222 కుటుంబాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించినప్పటికీ, ఇప్పటికీ వ్యాపారులకు న్యాయం జరగకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

వ్యాపారుల హక్కులను పరిరక్షిస్తూ వారికి స్థలాలు కేటాయించి, ప్రస్తుతం ఉన్న దుకాణాలను తొలగించకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు దిశలో ప్రచురితమైన వరుస కథనాలను ఎంపీ గోడం నాగేశ్‌కు చూపించి సమస్య తీవ్రతను వివరించారు. దీని పై స్పందించిన ఎంపీ గోడం నాగేశ్ మాట్లాడుతూ, దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రైల్వే అధికారులతో పాటు జిల్లా అధికారులతో కూడా మాట్లాడి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో రెబ్బెన సర్పంచ్ దుర్గం భరద్వాజ్, బీజేపీ జిల్లా నాయకులు గుల్బం చక్రపాణి, కోలిపాక కిరణ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఎం. సుదర్శన్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్, కనగాల మాణిక్యరావు, అఖిలపక్ష నాయకులు అజయ్ జైస్వాల్, కృష్ణ, రవీందర్, జహీర్ బాబా, శ్రీను, పల్లె రాజేశ్వర్ పాల్గొన్నారు.

Next Story