- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ వ్యూహాత్మక మౌనం: గులాబీ గూటిలో అసలేం జరుగుతోంది?
ఇటీవల కొత్త పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల కొత్త పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కేసీఆర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ ఆయన అభిమానుల్లో తీవ్ర కోపాన్ని తెచ్చాయి. గ్రామ స్థాయి కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ ఆ వ్యాఖ్యలపై లోలోపల భగ్గుమంటున్నారు. కానీ, కవిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో బీఆర్ఎస్‌కు చెందిన ఏ లీడర్ సైతం స్పందించలేదు. కవితను విమర్శించలేదు. ఆమె కామెంట్స్‌పై ఎవరూ మాట్లాడొద్దని అధిష్టానం సీరియస్‌గా ఆదేశాలు ఇవ్వడంతో ఎవరూ స్పందించలేదని తెలిసింది. సోమవారం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. ఇంత పెద్ద సమావేశంలోనైనా కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందిస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ.. అసలు ఆమె పేరు సైతం ప్రస్తావించకుండానే సమావేశాన్ని ముగించేశారు. నాయకత్వం మౌనం వెనుక వ్యూహమా? లేక అంతర్గత గందరగోళమా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.
కేసీఆర్ మౌనం.. సంకేతాలేనా?
సాధారణంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడితే పార్టీలు వెంటనే స్పందించి తమ స్టాండ్‌ను క్లియర్ చేస్తాయి. కానీ.. ఈసారి బీఆర్ఎస్ నుంచి అలాంటి రియాక్షన్ కనిపించలేదు. కవిత చేసిన వ్యాఖ్యలపై అధికారిక ప్రకటన లేకపోవడం, నాయకులు వ్యక్తిగతంగానూ మాట్లాడటానికి దూరంగా ఉండటం గమనార్హం. పార్టీ లోపలే నేతలు రెండు మైండ్‌సెట్‌లలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వర్గం కవిత వ్యాఖ్యలను సమర్థించాలనే భావనలో ఉండగా, మరో వర్గం దూరంగా ఉండడమే మంచిదని భావిస్తోంది. దీంతో కౌంటర్ ఇవ్వాలా? లేక సైలెంట్‌గా ఉండాలా? అన్న సందిగ్ధత పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ పార్టీ అధినేత కేసీఆర్ ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సాధారణంగా కీలక విషయాలపై దిశానిర్దేశం ఇచ్చే కేసీఆర్ మౌనం పాటించడం వెనుక రాజకీయ లెక్కలున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది విశ్లేషకులు దీన్ని వేచి చూడే ధోరణిగా భావిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ మౌనం రెండు కోణాల్లో చర్చకు వస్తున్నది. వివాదం మరింత పెరగకుండా వ్యూహాత్మకంగా సైలెంట్‌గా ఉండడం ఒకటైతే.. పార్టీ లోపలే ఏకాభిప్రాయం లేకపోవడం మరొకటి అని సమాచారం. వీటిలో ఏది నిజమో స్పష్టత లేకపోయినా, ఈ మౌనం మాత్రం రాజకీయంగా పార్టీకి సవాల్‌గా మారింది. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పష్టమైన స్టాండ్ తీసుకుంటుందా? లేక ఇదే మౌనం కొనసాగిస్తుందా? అన్నది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం త్వరలో క్లారిటీ ఇస్తేనే కేడర్‌లో ఉన్న కన్ఫ్యూజన్ తొలిగే అవకాశం ఉన్నదని క్షేత్రస్థాయి నుంచి వినిపిస్తున్న మాట.
కేటీఆర్ స్పందించినా..
ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన తరువాత కవిత అంశంపై పరోక్షంగా స్పందించారు. కొత్త పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అంటూ కామెంట్స్ చేశారు. అంతే తప్పితే ఆమెకు సంబంధించి నేరుగా ఎలాంటి ప్రస్తావనా తీసుకురాలేదు. దాంతో అసలు కవిత విషయంలో పార్టీ లైన్ ఏంటన్న చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ కేడర్‌లో మాత్రం అయోమయం స్పష్టంగా కనిపిస్తున్నది. సోషల్ మీడియాలో, స్థానిక స్థాయిలో ఎలా స్పందించాలో తెలియక కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. పార్టీ నుంచి క్లియర్ మెసేజ్ రాకపోవడంతో ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడుతున్నది.






