యువత ఆలోచించాలి..దేశాన్ని రక్షించుకోవాలి

by velandi.Saikiran |

యువతే దేశ భవిష్యత్తు అనీ, దేశాన్ని రక్ష‍ించుకోవాలని సీపీఎం పొలిట్‌ ‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు పిలుపునిచ్చారు.

యువత ఆలోచించాలి..దేశాన్ని రక్షించుకోవాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: యువతే దేశ భవిష్యత్తు అనీ, దేశాన్ని రక్ష‍ించుకోవాలని సీపీఎం పొలిట్‌ ‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు పిలుపునిచ్చారు. ట్రంప్‌, మోడీ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలపై పోరాడాలని కోరారు. యువతలో అభ్యుదయ, హేతువాద, లౌకిక, సోషలిస్టు భావాలను పెంపొందించడంతో డీవైఎఫ్‌ఐ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్ష‍ించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా సరూర్‌‌నగర్‌ ‌మండలం కొత్తపేటలోని బాబు జగ్జీవన్‌‌రావు భవన్‌‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన సమ్మేళనంలో రాఘవులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి యువత దేశ, ప్రపంచ రాజకీయాలను క్ష‍ుణ్ణంగా పరిశీలిస్తోందనీ, అదే సమయంలో పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నదని తెలిపారు. ఆ యువతను అభ్యుదయ భావజాలం వైపు మళ్లించాలని డీవైఎఫ్‌ఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌‌లోని అమెరికా కాన్సులేట్‌ ‌కార్యాలయం ఉన్న రోడ్డుకు ట్రంప్‌ ‌పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టారు. ప్రపంచమంతా ట్రంప్‌‌ను తిడుతున్న సందర్భంలో రేవంత్‌‌రెడ్డి ఆయన్ను పూజించడం ఏంటని ప్రశ్నించారు.

ఇరాన్‌‌పై యుద్ధానికి, మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎరువులు ధరలు పెరగడానికి, హార్మూజ్‌ ‌జలసంధిలో మన నౌకపై దాడిచేసి ముగ్గురు భారతీయుల ప్రాణాలు తీయడానికి, హెచ్‌1‌బీ1 వీసాపై ఆంక్ష‍లు పెట్టడానికి కారణమైన ట్రంప్‌ ‌పేరును హైదరాబాద్‌‌లోని రోడ్డుకు పెట్టడం ఏంటి అని నిలదీశారు. ఆ పేరును వెంటనే తొలగించాలని డిమాండ్‌ ‌చేశారు. దేశానికి ఇంత అన్యాయం జరుగుతున్నా మోడీ ఇంకా ట్రంపు భక్తిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగానూ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువత ఆలోచిస్తున్నదని తెలిపారు. ఇజ్రాయిల్‌‌ ఇంటలిజెన్స్‌ ‌వ్యవస్థ కోసం గూగుల్‌ ‌సాంకేతిక వ్యవస్థ పనిచేయడాన్ని తప్పుబడుతూ స్టాన్‌‌ఫర్డ్‌ ‌యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గూగుల్‌ ‌సంస్థ చైర్మెన్‌ ‌సుందర్‌ ‌పిచ్చాయ్‌ ‌ప్రసంగాన్ని విద్యార్థులు బాయ్‌‌కాట్‌ ‌చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇరాన్‌ అయిపోగానే క్యూబానే టార్గెట్‌ అని ట్రంప్‌ చెప్పడం దుర్మార్గమన్నారు. క్యూబాకు అండగా నివాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 50 లక్ష‍ల జనాభా ఉన్న క్యూబా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. దివిటిలా ఉన్న క్యూబా తన వెలుతురును మరిన్ని దేశాలకు విస్తరిస్తుందనే భయం అమెరికాను వెన్నాడుతున్నదన్నారు. సోషల్‌‌మీడియాను అభ్యుదయ శక్తుల కంటే విచ్ఛిన్నకర శక్తులు ఎక్కువ ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. యువత మత్తుకు బానిస కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో సైద్ధాంతిక, సాంస్కృతిక పోరాటాలు ఉధృతం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాపాంగణాలు, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పన కోసం ఫోకస్‌ ‌పెట్టి పనిచేయాలనీ, ఆటల పోటీలను రెగ్యులర్‌‌గా నిర్వహించాలని డీవైఎఫ్‌ఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. యువతకు దగ్గరకు అయినప్పుడే వారు మనం చెప్పేది వింటారని చెప్పారు.

యువత పక్ష‍ాన పోరాడుతాం : డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష‍ులు, రాజ్యసభ సభ్యులు ఏఏ.రహీం

మోడీ సర్కారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనీ, యువత శక్తి సామర్థ్యాలను, సృజనాత్మకతను ఉపయోగించుకోవడంలో పాలకులు విఫలమయ్యారని డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష‍ులు, రాజ్యసభ సభ్యులు ఏ.ఏ.రహీం విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నదని నిటిఅయోగ్‌, తదితర సంస్థలు ఎత్తిచూపుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉద్యోగకల్పనలోనూ, పరిశ్రమల ఏర్పాటులోనూ మోడీ సర్కారు విఫలమైందన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ ‌శక్తులకు కట్టబెడుతున్నదనీ, ఉన్న సంస్థల్లోనూ రెగ్యులర్‌ ఉద్యోగులను కాకుండా కాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమిస్తున్నదని విమర్శించారు. ఉపాధి అవకాశాల్లేక పీహెచ్‌‌డీ, ఎంటెక్‌, బీటెక్‌ ‌చదివిన వాళ్లు కూడా ఆన్‌‌లైన్‌ ‌ప్లాట్‌‌ఫామ్‌ ‌వేదికలపై ఉద్యోగాలు చేస్తున్నారనీ, దేశంలో గిగ్‌ ఎకనామీ పెరిగిపోతున్నదని చెప్పారు. అయితే, అక్కడా యువత ఉద్యోగాలకు గ్యారంటీ లేదనీ, స్థిరమైన జీతాలు లేవని ఎత్తిచూపారు. మన దేశంలో విద్యావ్యవస్థ ఫెయిల్యూర్‌ అయిందని విమర్శించారు. నీట్‌ ‌పరీక్ష‍ పేపర్‌ ‌లీకేజీ వల్ల లక్ష‍లాది మంది విద్యార్థుల జీవితాలు ఆగమయ్యాయనీ, ఆరుగురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులెవరు? అని ప్రశ్నించారు. బాధ్యత వహించకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇంకా పదవిలో ఉండటాన్ని తప్పుబట్టారు. గౌరవప్రద జీవితం, భవిష్యత్తు కావాలని యువత కొట్లాడుతుంటే, ప్రశ్నిస్తుంటే దేశ ద్రోహులు, విదేశీ ఏజెంట్లు అనే ముద్ర వేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు, సంఘ్‌‌పరివార్‌ ‌శక్తులు దేశంలో ప్రజలను కులం, మతం, ప్రాంతం పేరుతో విభజించి రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఇలాంటివి ఎక్కువ కాలం చెల్లుబాటు కావనీ, నేటి యువత ప్రత్యామ్నాయ రాజకీయ విధానం కోసం రోడ్లెక్కుతున్నదని తెలిపారు. పాలకుల విధానాలతో విసిగివేసారేసి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జెన్‌‌జీ రోడ్లెక్కుతున్నదన్నారు. యువతలో శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకికతత్వం పరిరక్ష‍ణకు డీవైఎఫ్‌ఐ ముందుండి పోరాడుతుందని ప్రకటించారు.

మతతత్వ ప్రభావం తగ్గుతోంది : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం …

మతతత్వ రాజకీయాలకు క్రమంగా కాలం చెల్లుతున్నదనీ, సీజేపీ పోరాటంతో మోడీ సర్కారులో వణుకు మొదలైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. నిరుద్యోగ సమస్య, దేశ సొమ్మును కార్పొరేట్లకు మోడీ సర్కారు దోచిపెడుతున్న తీరుపైనా, ప్రజల పక్ష‍ాన నికరంగా నిలబడి కొట్లాడుతున్నదెవరనే దానిపైనా యువత ఆలోచించడం మొదలు పెట్టిందన్నారు. సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించే శక్తులు ప్రపంచ వ్యాప్తంగానూ బలపడుతున్నాయనీ, ఎర్రజెండా నేతృత్వంలోని చైనా వాటికి అండగా ఉంటున్నదని చెప్పారు. ఇరాన్‌‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ ‌యుద్ధం చేస్తుంటే ఎక్కడా తగ్గకుండా అంతే తీవ్రతతో ప్రతిఘటిస్తోందనీ, దీంతో సామ్రాజ్యవాదం డిఫెన్స్‌‌లో పడిపోయిందని తెలిపారు. ట్రంప్‌‌నకు మద్దతిస్తున్న మోడీ ప్లేటు ఫిరాయించే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయన్నారు. ఇజ్రాయిల్‌ ‌నరమేధానికి ఇండియా, యూఎస్‌ఏ తప్ప ఏ దేశం కూడా మద్దతు తెలపడం లేదన్నారు. పేదల పక్ష‍ాన కొట్లాడుతున్న సీపీఎంకు మంచిరోజులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారం, పదవుల్లో ఉన్నప్పుడు కాకుండా కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డ వారే నిజమైన కమ్యూనిస్టు అని చెప్పారు. ప్రజల్లో పనిచేయాలంటే నిరంతర అధ్యయనం అవసరమని నొక్కి చెప్పారు. మార్క్సిజాన్ని ఆకళింపు చేసుకుంటేనే మానవ సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతామన్నారు.

కమ్యూనిస్టుల వెంట్రుకకు కూడా సరికాడు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ..

పవన్‌ ‌కళ్యాణ్‌ ‌కమ్యూనిస్టుల వెంట్రుకకు కూడా సరితూగడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎర్రజెండా చరిత్రను చెప్పడం కాదు... మరో చరిత్రను సృష్టించాలని పిలుపునిచ్చారు. త్వరలో హైదరాబాద్‌‌లో భారీ బహిరంగ సభ ఉండనుందన్నారు. ప్రపంచానికి, దేశానికి కండ్ల లాంటి యువత అనీ, దేశం, ప్రపంచంలో నెలకొన్న అసమానతలు, లౌకికతత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థపై బుల్డోజర్‌ ‌వ్యవస్థ చేస్తున్న దాడులపై ప్రతిఘటన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఈ యువజన సమ్మేళనంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీనియర్ నేత డీజీ నర్సింహారావు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ మమత, సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భాస్కర్, రాంచందర్, జగన్, జగదీశ్, సామేల్, తదితరులు పాల్గొన్నారు.

Next Story