- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. హైదరాబాద్ మెట్రో నిధులపై కీలక రిక్వెస్ట్
రాష్ట్ర ప్రయోజనాలు, హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించేందుకు తాను ఎంతకైనా సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) ఆమోదించిన రుణాన్ని వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)ని కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ బహిరంగ లేఖ రాస్తూ.. మెట్రో నిధుల మంజూరులో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రస్తావించారు. మెట్రో ప్రాజెక్టు కోసం IRFC నుంచి జూన్ 15న నిధులు విడుదల కావాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు ఆ రుణం మంజూరు కాలేదని సీఎం లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇప్పటికే రూ.1,451 కోట్ల ఈక్విటీని చెల్లించిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చినందున, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా సకాలంలో ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు.
రైల్వే మంత్రితో చర్చించండి..
తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw)తో మాట్లాడి, నిలిచిపోయిన మెట్రో రుణాన్ని వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరారు. దీనితో పాటు, హైదరాబాద్ నగర రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు (Hyderabad Metro Phase-2 Project)కు కూడా కేంద్ర ప్రభుత్వం త్వరగా అనుమతులు ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని లేఖలో కోరారు. రాష్ట్ర ప్రయోజనాలు, హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టులపై చర్చించేందుకు తాను ఎంతకైనా సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అవసరమైతే ఈ అంశాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో వ్యక్తిగతంగా సమావేశమై చర్చించడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు సీఎం తన లేఖలో స్పష్టం చేశారు.






