- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీ.. తల్లిదండ్రుల బాధలు పట్టవా?: కవిత
ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు దోపిడీపై ప్రభుత్వం నియంత్రణ చట్టం తీసుకురావాలని ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బిల్లు పాస్ చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఒకేసారి 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏటా 8 శాతానికి మించి ఫీజు పెంచటాన్ని ప్రభుత్వం నిరోధించాలన్నారు.
పేద కుటుంబాలపై భారం:
ఏప్రిల్ కూడా రాక ముందే ప్రైవేట్ స్కూల్స్ 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచుతున్నాయని లక్షా రూపాయలు ఫీజు ఉంటే ఇప్పుడు మరో 30 వేలు భారం కాబోతోందన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ లో చాలా స్కూల్స్ వద్ద పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారన్నారు. ప్రతి నెల ఫీజు తీసుకోవాల్సింది పోయి ఒకేసారి 60 శాతం ఫీజు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని దీని కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారీగా భారం పడే పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు నియంత్రణ చేయలేదంటూ ఇదే ముఖ్యమంత్రి గతంలో విమర్శించారని కానీ ఈ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తోంది. ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో ఒకరిని ఒకరు తిట్టుకోవటానికే సరిపోయిందని ఈ ప్రభుత్వం వచ్చి ముూడేళ్లైనా ఫీజు నియంత్రణ జరగకపోవటం సిగ్గుచేటని విమర్శించారు. స్కూల్స్ ముందు పేరెంట్స్ ధర్నా చేస్తున్న ఈ సమయంలోనైనా ప్రభుత్వంలో కదలిక రావాలన్నారు. అర్జెంట్‍గా స్పెషన్ అసెంబ్లీ సెషన్ నిర్వహించి ఫీజు నియంత్రణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి విద్యా కమిషన్ రిపోర్ట్ చెత్తగా ఉన్నప్పటికీ అందులో ఏటా ఫీజును 7 నుంచి 8 శాతం పెంచుకోవచ్చని సూచించింది. కనీసం దాన్ని ప్రభుత్వం అమలు చేయాలన్నారు.
ఫీజులు పెంచి జీతాలు పెంచడం లేదు:
ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు పెంచిన విధంగా పిల్లల తల్లిదండ్రులకు జీతాలు పెరగవని కవిత అన్నారు. ఫీజులు పెంచినప్పటికీ నారాయణ, చైతన్య లాంటి స్కూల్స్ లో టీచర్లకు జీతాలు పెండం లేదని కనీసం టీచర్లకు పీఎఫ్ కూడా ఇవ్వటం లేదన్నారు. ప్రైవేట్ టీచర్ల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని విమర్శించారు. ప్రైవేట్ స్కూల్స్ లో ఫుడ్ కూడా బాగుండటం లేదు. మేము డిమాండ్ చేస్తేనే ఫుడ్ సెక్యురిటీ టాస్క్ ఫోర్స్ ను వేశారు. నారాయణ, చైతన్య వంటి స్కూల్స్ లో ఒకే దగ్గర పదివేల మందికి ఫుడ్ తయారు చేస్తున్నారు. కొంచెం ఫుడ్ పాయిజన్ అయిన సరే పదివేల మంది విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందన్నారు. అందువల్ల కార్పొరేట్ స్కూల్స్ లో ఫుడ్ శాంపిల్స్ ను చెక్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయా స్కూళ్లలో ఫీజులు ఎక్కువ, చదువు తక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు
ముఖ్యమంత్రే ఓపెనింగ్స్ కు వెళ్తున్నారు:
ప్రైవేట్ ను నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్ కు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. అంటే ప్రైవేట్ దోపిడీని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా ఆయనే సంకేతాలు ఇచ్చినట్లేనన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవటంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ కాలేజ్ లు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. కాలేజ్ యాజమాన్యాలు పిల్లల సర్టిఫికెట్స్ ను వెంటనే ఇవ్వాలని కోరుతున్నానని మీకు వచ్చే బకాయిలను మీ తరఫున పోరాటం చేసి ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామన్నారు.
నార్త్ స్కూల్స్ లో మన వాళ్లకు ఉద్యోగాలేవి?
కార్పొరేట్స్ స్కూల్స్ మాత్రమే కాకుండా నార్త్ నుంచి కూడా స్కూల్స్ వస్తున్నాయని అలెన్, ఎక్స్ లెన్స్, రెజిలెన్స్, ఫిజిక్స్ వాలా అంటూ నార్త్ స్కూల్స్ పెడుతూ వాటిల్లో ఉద్యోగాలు నార్త్ వాళ్లకే ఇస్తున్నారని కవిత ఆరోపించారు. తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వని స్కూల్స్ కు ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వవద్దన్నారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమకారులకు పర్మిషన్లు ఇవ్వండి. వాళ్లైనా బతుకుతారని సూచించారు. అన్ని ప్రైవేట్ స్కూల్స్ బాగాలేవని నేను అనటం లేదు. కొన్ని స్కూల్స్ పిల్లలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాయని చెప్పారు. పేరెంట్స్ కు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వారిని పురుగుల్లా చూస్తున్న స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణ, చైతన్య లాంటి స్కూల్స్ ఏటా 15 వందల కోట్ల వ్యాపారం చేస్తూ రకరకాల పేర్లతో ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని పైగా ధోభి, ఫుడ్, పుస్తకాలు ఇలా దేనికి కూడా మన వాళ్లకు అవకాశం ఇవ్వటం లేదన్నారు. నారాయణ, చైతన్య స్కూల్స్ వాళ్లకు ప్రత్యేకంగా ప్రింటింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ విధానాన్ని బీఆర్ఎస్ ఎంకరేజ్ చేసిందని కాంగ్రెస్ కూడా అలానే చేస్తే వారికి పట్టిన గతే పడుతుందని హెచ్చారించారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం మన ఖర్మ అని విమర్శించారు. ఎన్నికల వరకు విద్యార్థుల అంశాన్ని రేవంత్ రెడ్డి వాడుకున్నారు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే కూడా కనీసం రివ్యూ చేయటం లేదని విమర్శించారు.






