- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ: ATEXCON సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
2047 నాటికి తెలంగాణను దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటంచారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రం కేవలం ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా, ప్రపంచ వస్త్ర రంగంలోనూ అగ్రగామిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైటెక్స్‌లో జరిగిన 13వ ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్ (ATEXCON) 2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
టెక్స్‌టైల్ మన DNAలోనే ఉంది
తెలంగాణకు వస్త్ర రంగంతో విడదీయలేని అనుబంధం ఉందని సీఎం గుర్తుచేశారు. ‘టెక్స్‌టైల్ అనేది మనకు కేవలం ఒక పరిశ్రమ కాదు, అది మన జీవనాధారం. నిజాం కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు వస్త్రాలు, ముత్యాల కోసం హైదరాబాద్‌కు వచ్చేవారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వంటివి మన సంస్కృతిలో భాగం. టెక్స్‌టైల్ మన DNA లోనే ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం..
రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతూ.. తెలంగాణను దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దడం మా ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉందని, ఇందులో అనేక అపారెల్ పార్కులు ఉన్నాయని సీఎం తెలిపారు. నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ఇక్కడి పత్తికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి పేరుందని పేర్కొన్నారు. లండన్, పారిస్, దుబాయ్ వంటి ఫ్యాషన్ నగరాల్లో తెలంగాణలో తయారైన దుస్తులు మెరవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు.
సినిమా, ఫ్యాషన్, గ్రీన్ టెక్నాలజీ
హైదరాబాద్ ఇప్పుడు కేవలం టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థల రాకతో హాలీవుడ్ స్థాయికి చేరుతోందని సీఎం అన్నారు. సినిమా రంగానికి అవసరమైన ఫ్యాషన్ అవసరాలను కూడా తెలంగాణ నుంచే తీర్చేలా ప్రోత్సహిస్తామన్నారు. అలాగే, పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ ‘గ్రీన్ టెక్స్‌టైల్ హబ్’లను అభివృద్ధి చేస్తామని, మహిళలకు అధునాతన డిజైనింగ్, స్టిచింగ్‌లో శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. ‘మీ దగ్గర విజన్ ఉంటే, మేము మీకు సరైన భాగస్వాములం. భూమి, విద్యుత్, నీరు మరియు వేగవంతమైన అనుమతులతో పాటు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రండి, కలిసి ఒక కొత్త భవిష్యత్తును నిర్మిద్దాం’అని పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు, ఆపిల్ ఇయర్‌పాడ్స్ అందిస్తున్న తెలంగాణ.. ఇప్పుడు ప్రపంచం ధరించే దుస్తులను కూడా అందించే స్థాయికి చేరుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.






