ఎంపీ బరిలో జీవిత రాజశేఖర్? అక్కడ నుంచి టికెట్ కన్ఫార్మ్?

by Disha Web |
ఎంపీ బరిలో జీవిత రాజశేఖర్? అక్కడ నుంచి టికెట్ కన్ఫార్మ్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికార టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీలో సీట్ల కేటాయింపు అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఓ వైపు పార్టీ పుంజుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమైన స్థానాల్లో ఆశావాహులు పెరిగిపోతున్నారు. పార్టీలోని టాప్ లీడర్ల మధ్యనే ఈ తరహా పోటీ ఉండగా.. ఇటీవల పార్టీలోకి వలస వస్తున్న నేతలు సైతం తమకు టికెట్ సంగతి తెల్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఓ మహిళా నేత పోటీ చేసే స్థానం ఖరారైనట్లు జరుగుతున్న ప్రచారం ఇప్పుడు తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటి జీవిత రాజశేఖర్ కు టికెట్ విషయంలో హామీ లభించినట్లు చర్చ జరుగుతోంది. ఆమె పార్టీలో చేరిన సందర్భంలోనే టికెట్ విషయంలో క్లారిటీ ఇస్తేనే చేరుతాననే కండీషన్ పెట్టారని, ఈ క్రమంలో ఆమె పోటీ చేయబోతున్న స్థానం ఇదేనంటూ ప్రచారం తెరపైకి రావడం ఆసక్తిగా మారింది.

అక్కడి నుండి పోటీ చేయనున్న జీవిత?

సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జీవిత రాజశేఖర్ కు ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది. ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా చెప్పేసే జీవిత ఇటీవలే బీజేపీలో చేరింది. గత నెలలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. సీఎం కేసీఆర్ పై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తులెన్ని ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. క్లబ్, పబ్ లు అన్నింటిలో కేటీఆర్ కు వాటా ఉందని ఆరోపించారు. తనదైన రీతిలో దూసుకుపోయే జీవిత రాజశేఖర్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ గుప్పిట్లో ఉన్న ఈ స్థానంలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి బాణాల లక్ష్మారెడ్డి పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో జీవిత రాజశేఖర్ రెడ్డికి ఈ స్థానం లభించనుందనే ప్రచారం గుప్పుమంటోంది.

కేంద్ర మంత్రి అండదండలు?

అయితే బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఈ లోక్ సభ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో నిర్మలా సీతారామన్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పర్యటన రాష్ట్ర రాజకీయంలో తీవ్ర దుమారం రేపింది. మహిళా ఇన్ చార్జిగా ఉన్న ఈ స్థానంలో మరో మహిళ జీవితకు టికెట్ రాబోతుందనే టాక్ పై ఉహాగానాలు మొదలయ్యాయి. అయితే జీవిత పోటీ చేయబోయే విషయంలో ఇప్పటి వరకు కేవలం ప్రచారమే జరుగుతుండగా పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.

Also Read: సినిమా తీస్తే పాన్ ఇండియా హిట్ పక్కా.. కేటీఆర్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి సెటైర్

Next Story

Most Viewed