ఎక్స్‌పైరీ సరుకులతో ప్రజారోగ్యానికి ముప్పు.. పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారులు?

by Jakkula.Mamatha |

అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో కొందరు దుకాణదారులు ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, ప్యాకెట్ ఫుడ్స్ తదితర వస్తువులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎక్స్‌పైరీ సరుకులతో ప్రజారోగ్యానికి ముప్పు.. పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారులు?
X

దిశ, అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో కొందరు దుకాణదారులు ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, ప్యాకెట్ ఫుడ్స్ తదితర వస్తువులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కొందరు వ్యాపారులు గడువు ముగిసిన సరుకులను తక్కువ ధరలకు విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న కిరాణా దుకాణాల్లో ఎక్స్‌పైరీ తేదీలు పూర్తయిన వస్తువులు ఇప్పటికీ అలమారాల్లో కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా కొనుగోలు చేసే చాక్లెట్లు, బిస్కెట్లు, పానీయాలపై సరైన తనిఖీలు లేకపోవడంతో వినియోగదారులు మోసపోతున్నారని అంటున్నారు.

ఆహార భద్రత నిబంధనల ప్రకారం.. గడువు ముగిసిన వస్తువులను విక్రయించడం చట్ట విరుద్ధమైనప్పటికీ, సంబంధిత శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు దుకాణదారులు ఎక్స్‌పైరీ డేట్ స్టిక్కర్లను తొలగించడం లేదా కొత్త స్టిక్కర్లు అంటించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎక్స్‌పైరీ సరుకుల వినియోగం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పులు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొనుగోలు చేసే ముందు ప్రతి వస్తువు పై తయారీ, గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మండల వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఎక్స్‌పైరీ సరుకుల విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్స్‌పైరీ సరుకుల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Next Story