- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి: ఎంపీ డీకే అరుణ
జోగులాంబ గద్వాల జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, జోగులాంబ ప్రతినిధి : జోగులాంబ గద్వాల జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్వాలలోని ఎస్వీ ఈవెంట్ హాల్‌లో గురువారం నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆమె విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి సీఎం అయినప్పటికీ జిల్లాలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్నారు. జూరాల ప్రాజెక్టు నిర్వహణ సరిగ్గా లేదని, సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉందని పేర్కొన్నారు.
ర్యాలంపాడు ప్రాజెక్టులో గత నాలుగైదేళ్లుగా నీటి నిల్వలు సక్రమంగా లేవని, మరమ్మతులు కూడా చేపట్టడం లేదని ఆరోపించారు. గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తికాకపోవడం, తుమ్మిళ్ల లిఫ్ట్ కింద రిజర్వాయర్లు, కాలువల పనులు నిలిచిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విమర్శించారు. రైతులకు హామీ ఇచ్చిన రైతు భరోసా సక్రమంగా అమలు కావడం లేదని, ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులకు ప్రాధాన్యత ఇవ్వాలని, కార్యకర్తలకు ఇళ్లు కేటాయిస్తే ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. జిల్లాలో అవినీతి, అక్రమాలు పెరిగాయని ఆరోపిస్తూ ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్న ఆమె, తెలంగాణలో కూడా బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా ఇన్‌చార్జి బాపురెడ్డి, జోనల్ శిక్షణ కన్వీనర్ ఓఎస్ రెడ్డి, డీకే స్నిగ్ధ రెడ్డి, రామచంద్ర రెడ్డి, రవికుమార్ ఎక్బోటే, కేకే రెడ్డి, శ్యాంరావు, బండల వెంకట రాములు, అక్కల రమాదేవి, బలిగేర శివారెడ్డి, రాజగోపాల్, టి. కృష్ణవేణి, బండల పద్మావతి, రజక జయశ్రీ, మానస త్యాగరాజ్ పాల్గొన్నారు.






