- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LTCG Tax: విదేశీ పెట్టుబడులకు భారీ ఊతం
ఈ కొత్త రూల్‌ను త్వరగా అమలు చేయడం కోసం ఆదాయపు పన్ను చట్టాన్ని మార్చే 'ఆర్డినెన్స్'కు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: విదేశీ పెట్టుబడులను తిరిగి భారత మార్కెట్ల వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై (ఎఫ్‌పీఐ) విధిస్తున్న దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ) పూర్తిగా రద్దు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ కొత్త రూల్‌ను త్వరగా అమలు చేయడం కోసం ఆదాయపు పన్ను చట్టాన్ని మార్చే 'ఆర్డినెన్స్'కు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్రపతి సంతకం కాగానే ఈ సరికొత్త పన్ను సడలింపు అమల్లోకి రానుంది.
ఈ నిర్ణయం వెనుక కారణం
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, రోజురోజుకూ పెరుగుతున్న ముడి చమురు ధరలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. దీనికి తోడు, ఈ ఏడాది విదేశీ పెట్టుబడిదారులు మన షేర్ మార్కెట్ నుంచి ఏకంగా రూ. 2.5 లక్షల కోట్లను వెనక్కి తీసేసుకున్నారు. మన మార్కెట్ నుంచి డాలర్లు విదేశాలకు వెళ్ళిపోవడంతో, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ బాగా బలహీనపడింది. ఈ నష్టాన్ని పూడ్చడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశీ ఇన్వెస్టర్లు మనదేశంలో బాండ్లు కొని, వాటిని ఏడాది కంటే ఎక్కువ కాలం ఉంచుకుని లాభాలతో అమ్ముకుంటే.. ఆ లాభంపై 12.5 శాతం ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఆ పన్ను ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. అంతేకాదు, ఈ బాండ్ల ద్వారా విదేశీయులకు వచ్చే వడ్డీ ఆదాయంపై ప్రస్తుతం ఉన్న 20 శాతం విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌ను (వడ్డీపై ముందే కట్ అయ్యే పన్ను) కూడా తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే మన దేశ బాండ్లు ఎక్కువ లాభసాటిగా కనిపించాలనేదే దీని వెనుక ఉన్న అసలు ప్లాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.






