- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'నందూస్ వరల్డ్' కపుల్స్ కంత్రీ ప్లాన్ ఇదే.. యూకే కంపెనీలతో ఎలా బురిటీ కొట్టించారంటే?
ప్రముఖ యూట్యూబర్ 'నందూస్ వరల్డ్' దంపతులపై వీసా, ఉద్యోగాల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ యూట్యూబర్ 'నందూస్ వరల్డ్' దంపతుల మోసాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పైకి అమాయకంగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయిన ఈ దంపతులు తెర వెనుక భారీ ఎత్తున మోసం, వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఉద్యోగాలు, వీసా రెన్యువల్ పేరుతో పలువురి నుంచి వసూళ్లు చేశారంటూ గతేడాది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నం పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే తామేమి తప్పుచేయలనేది నందు దంపతులు చెబుతుంటే, తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. దీంతో అసలు నందూస్ వరల్డ్ కపుల్స్ వ్యవహారంలో అసలేం జరిగింది అనేది రెండు తెలుగు స్టేట్స్ లో ఆసక్తిగా మారింది.
అసలేం జరిగింది?:
గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, అన్నే రమా నందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. ‘నందూస్ వరల్డ్’ పేరుతో రమా నందన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఈ చానల్ ద్వారా ఈ కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ సంపాదించుకుని ఇటీవలే మెగాస్టార్ నటించిన చిత్రంలో నందన ఓ పాత్రలో నటించే చాన్స్ సైతం కొట్టేశారు. యూకేలో ఉంటున్న వీరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. విద్య, ఉపాధి నిమిత్తం యూకే వెళ్లే వారి కోసం వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొత్తూరుకు చెందిన శివ క్రాంతి కుమార్ లండన్‌లో చదువుకునే సమయంలో మధుకర్ పరిచయం అయ్యాడు. అక్కడ కొన్నాళ్లు ఉద్యోగం చేసి, తిరిగి ఇబ్రహీంపట్నం వచ్చారు. ఈ క్రమంలో తన వీసా రెన్యువల్ తో పాటు తన భార్య కు సీవోఎస్ (సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్) , ఉద్యోగ అవకాశాల కోసం శివక్రాంతి మధుకర్ ను సంప్రదించారు. దీంతో గుంటూరులో ఉన్న డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్లి రూ. 15 లక్షలు చెల్లించాలని మధుకర్ సూచించారు. నగదు చెల్లించిన రెండు నెలలకు మరో కంపెనీ పేరుతో తనకు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ను పంపించారని అది మోసం అని తేలడంతో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అడిగితే కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఇచ్చారని శివ క్రాంతి ఆరోపిస్తున్నాడు.
భార్యభర్తలే డైరెక్టర్లు:
వీసా రెన్యువల్, సీవోఎస్ కోసం నందూ దంపతులు పెద్ద ఎత్తున కంపెనీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వీరు తొలుత 2022లో ది డెస్టినీ రిక్రూట్‌మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఉపాధి/ఉద్యోగ నియామక సంస్థల సేవలు) పేరుతో కన్సల్టెన్సీ ఇండియాలో ప్రారంభించారు. ఈ పేరుతో ఉద్యోగాలు, సీవోఎస్ ఇస్తామని బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ఇతర సంస్థల పేరుతో లేటర్లు పంపుతూ మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందుకోసం యూకేలో క్లౌడ్‌సర్వ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (12 అక్టోబర్ 2021), ఆర్‌ఆర్‌జే టెక్ లిమిటెడ్ (3 అక్టోబర్ 2018), మోడ్రన్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ (25 ఏప్రిల్ 2024), గ్రీక్ ఓయాసిస్ లిమిటెడ్ (9 జులై 2025), చికెన్ ఆన్ ది వీల్స్ లిమిటెడ్ (18 జూన్ 2025), నందూస్ కేఫ్ లిమిటెడ్ (4 అక్టోబర్ 2024), స్మైల్ హెల్త్‌కేర్ సర్వీసెస్ లిమిటెడ్ (9 అక్టోబర్ 2023), నందూస్ కిచెన్ లిమిటెడ్ (4 మే 2023) సంస్థలను ఏర్పాటు చేసి వీటి పేరు మీద నకిలీ ఆఫర్ లెటర్లు పంపారని, వీటికి జాగర్లమూడి మధుకర్, రమా నందన దంపతులే డైరెక్టర్లుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తేలు కుట్టిన దొంగల్లా బాధితులు:
ఈ దంపతుల మోసం బారిన పడిన వారిలో ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బిహార్, తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు రూ. 20 లక్షల చొప్పున వసూలు చేసినా బాధితులు తేలుకుట్టిన దొంగల మాదిరిగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. తాము మోసపోయిన సంగతి ఫిర్యాదు చేస్తే యూకేలోకి తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందామనే అదను కేసులు మోయాల్సి వస్తుందనే భయంతోనే తమకు మోసం జరిగినా బాధితులు బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి అక్కడ జాతీయ విచారణ సంస్థ అయిన ‘యాక్షన్ ఫ్రాడ్’ కూడా మరో కారణం అని చెబుతున్నారు. యూకేలో ఎవరైనా ఆర్థికంగా మోసపోయినా, లేదా కంపెనీల ద్వారా మోసాలు జరిగినా నేరుగా స్థానిక పోలీసులకు కాకుండా 'Action Fraud' సంస్థకు ఫిర్యాదు చేస్తారు. ఇది సిటీ ఆఫ్ లండన్ పోలీసుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిలో బలమైన ఆధారాలు ఉంటే తదుపరి విచారణ కోసం NFIB (National Fraud Intelligence Bureau) అనే విభాగానికి బదిలీ చేస్తుంది. అందువల్ల ఈ దర్యాప్తులో ఇరుక్కుంటే లేని పోని చిక్కులు తెచ్చుకోవడమేనని భావిస్తున్న బాధితులు పెద్దగా బయటకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందిమంగా ఈ వ్యవహారంలో ఏం తేలబోతోంది అనేది ఆసక్తిగా మారింది.






