నేరెళ్ల బాధితులు గుర్తుకురావడానికి తొమ్మిదేళ్లు పట్టిందా?.. కవితపై జనసేన సెటైర్

by Prasad Jukanti |   (  Updated:2026-07-28 10:23:51  IST  )

కవిత నేరెళ్ల పర్యటనపై తెలంగాణ జనసేన సెటైర్లు వేసింది. తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడా అంటూ కవితపై జనసేన తీవ్ర విమర్శలు గుప్పించింది.

నేరెళ్ల బాధితులు గుర్తుకురావడానికి తొమ్మిదేళ్లు పట్టిందా?.. కవితపై జనసేన సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తెలంగాణ జనసేన మరోసారి విమర్శలు గుప్పించింది. నేరెళ్ల బాధితులు గుర్తుకురావడానికి కవితకు తొమ్మిదేళ్లు పట్టిందా? అని ప్రశ్నించింది. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులను ఇవాళ కవిత పరామర్శ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తెలంగాణ జనసేన స్పందించింది. అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ సానుభూతి ఏమైందని ప్రశ్నించింది?. తొమ్మిదేళ్లుగా ఆ కుటుంబాలు పడుతున్న అవస్థ నీకు ఏ రోజూ కనిపించలేదా? వారి ఆవేదన ఏనాడూ వినిపించలేదా? అని నిలదీసింది.

కొత్తగా కనిపిస్తున్నవి మీ మొసలి కన్నీళ్లే :

నేరెళ్ల ఘటనపై నాడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే “రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు” అన్న మీరే ఇవాళ ఏ మొహం పెట్టుకుని నేరెళ్ల వెళ్తున్నారని ప్రశ్నించింది. గోపాల్ చనిపోయాకే

ఆ కుటుంబాన్ని పరామర్శించాలన్న ఆలోచన వచ్చిందా? వాళ్ల బాధలు కొత్తవి కావు…వాళ్ల కన్నీళ్లు కొత్తవి కావని కొత్తగా కనిపిస్తున్నవి మీ మొసలి కన్నీళ్లే కవితక్కా అంటూ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో జనసేన పార్టీ ఓ పోస్టు చేసింది. కాగా నేరెళ్లలో ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు 8 మందిపై పోలీసులు థర్డ్‌‌‌‌ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసుల థర్డ్‌‌‌‌ డిగ్రీ ఘటనలో బాధితుడైన గంధం గోపాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. గోపాల్ కుటుంబ సభ్యులను ఇవాళ కవిత పరామర్శించారు.

సిగ్గుతో తలదించుకుంటున్న:

గోపాల్ కుటుంబాన్ని పరామర్శించాక మీడియాతో మాట్లాడిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నెరేళ్ల దాష్టీకం మనం సిగ్గుతో తలదించుకునే సంఘటన అప్పుడు పాలించిన కుటుంబంలో ఉన్నందుకు నేను సిగ్గుతో తలదించుకుంటూ క్షమాపణ అడుగుతున్నానన్నారు. ఈ సంఘటనపై రాజకీయాలు మాని అన్ని పార్టీలు మానవత్వంతో బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ధన దాహాం కోసం నేరెళ్లలో పేదల ప్రాణాలు తీసిన బడా బాబులకు ఒక్కరికైనా శిక్ష పడిందా? అని కవిత ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నెరేళ్ల బాధితుల పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా సరే ఇప్పటి వరకు నెరేళ్ల బాధితుల పేరు ఎత్తలేదు. ఈ ముఖ్యమంత్రికి కనీస మానవత్వం ఉందా? అని నిలదీశారు. ఈ దాష్టీకానికి పాల్పడిన ఒక్క పోలీసుకైనా శిక్ష పడిందా? అని స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‍ను ప్రశ్నించారు. ఈ విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏమైందో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. కచ్చితంగా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాటం చేస్తాం. అవసరమైతే నెరేళ్ల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామన్నారు.

‘బాధితులకు రూపాయి సాయం అందలేదు’.. నెరేళ్ల ఘటనపై కల్వకుంట్ల కవిత ఫైర్!

Next Story