‘బాధితులకు రూపాయి సాయం అందలేదు’.. నెరేళ్ల ఘటనపై కల్వకుంట్ల కవిత ఫైర్!

by Jakkula.Mamatha |

నెరేళ్లలో జరిగిన దాష్టీకానికి సిగ్గుతో తలదించుకోవాలని, అప్పుడు పాలించిన వారి కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఉన్న తాను బాధితులను క్షమాపణ కోరుతున్నానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

‘బాధితులకు రూపాయి సాయం అందలేదు’.. నెరేళ్ల ఘటనపై కల్వకుంట్ల కవిత ఫైర్!
X

దిశ, తంగళ్లపల్లి: నెరేళ్లలో జరిగిన దాష్టీకానికి సిగ్గుతో తలదించుకోవాలని, అప్పుడు పాలించిన వారి కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఉన్న తాను బాధితులను క్షమాపణ కోరుతున్నానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం కవిత నేరెళ్ల ఘటనలో చనిపోయిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయని అందరం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నామని, కానీ నెరేళ్ల ఘటన మనమంతా సిగ్గుతో తలదించుకునేలా చేసిందన్నారు. ఘటన జరిగినప్పుడు ఉన్న ప్రభుత్వంలోని కుటుంబంలో నేను కూడా సభ్యురాలినేనని, అందుకు సిగ్గుతో తలదించుకుంటూ.. మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నాను అన్నారు. కొందరి ధన దాహం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేలా చేశారని, ఇసుక లారీల కారణంగా ఒక బిడ్డ ప్రాణం పోతే ఇక్కడి ప్రజలు ఆందోళన చేశారని, దానికే వాళ్లపై పోలీసులు దాష్టీకం చేశారన్నారు. ఐదు రోజుల పాటు 8 మందిని ఇష్టానుసారంగా కొట్టారని, జైలర్ కూడా వాళ్లను జైల్లోకి తీసుకోలేమని చెప్పే అంతగా కొట్టారన్నారు.

ఈ దాష్టీకానికి పాల్పడిన ఒక్క పోలీసు కైనా శిక్ష పడిందా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే కేటీఆర్ ఏం చేస్తున్నాడని, బండి సంజయ్ కి ఏమైందన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ ను తీసుకొచ్చారని, కానీ దాని రిపోర్ట్ ఇప్పటికీ కూడా రాలేదన్నారు. అసలు ఏమైందో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. ధన దాహం కోసం పేదల ప్రాణాలు తీసిన బడా బాబులకు ఒక్కరికైనా శిక్ష పడిందా? అంటూ నిలదీశారు. బాధితులను మేము ఏదో పరామర్శించేందుకు టూరిస్టుల మాదిరిగా రాలేదని, ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాటం చేస్తామన్నారు.

అవసరమైతే నెరేళ్ల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామన్నారు. నెరేళ్ల బాధితుల మీద దాష్టీకానికి పాల్పడిన ఎస్పీపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ చెప్పిందని, కానీ ఒక ఎస్సైని బలి పశువును చేసి, దమనకాండ చేసిన వాళ్లను వదిలి పెట్టారన్నారు. ఎన్నికలకు ముందు నెరేళ్ల బాధితుల పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారని, 30 నెలలు గడిచినా సరే ఇప్పటి వరకు నెరేళ్ల బాధితుల పేరు ఎత్తలేదన్నారు. అసలు ఈ ముఖ్యమంత్రికి కనీస మానవత్వం ఉందా..? అని మండిపడ్డారు. అన్ని పార్టీలు నెరేళ్ల బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని, ఈ దమనకాండకు పాల్పడిన వాళ్లపై కలిసి పోరాటం చేద్దామన్నారు. ఈ విషయంలో రాజకీయం వద్దని, గత ప్రభుత్వంలోనూ, ఈ ప్రభుత్వంలోనూ ప్రశ్నించే వాళ్ల పై దాష్టీకానికి పాల్పడుతున్నారన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్ కూడా మానవత్వం మరిచారని, మీరా కుమార్ ని తీసుకొచ్చి న్యాయం చేస్తామని మాట ఇచ్చారని, ఇప్పటివరకు ఏం చేశారని ప్రశ్నించారు. నెరేళ్ల బాధితులు కన్నీళ్ల పునాదుల మీద అధికారం అనుభవిస్తున్నారన్నారు. చనిపోయిన గోపాల్ కుటుంబం 9 ఏళ్లపాటు హాస్పిటల్స్ చుట్టూ తిరిగిందని, ఒక్క రూపాయి కూడా వారికి ప్రభుత్వం నుంచి అందలేదన్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, వాళ్ల పిల్లల చదువుల ఖర్చు భరించాలన్నారు. నెరేళ్ల బాధితులందరికీ కచ్చితంగా ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దాష్టీకానికి పాల్పడిన పోలీసులకు శిక్ష పడాలన్నారు. తెలంగాణ రక్షణ సేన అంటే తెలంగాణను రక్షించుకునేందుకే పెట్టిన పార్టీ అని, ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తామని, నెరేళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

Next Story