ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అదనపు ఫీజు వసూళ్లు.. TAFRC సంచలన హెచ్చరిక

by Kema Shiva Kumar |

ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అదనపు ఫీజుల వసూలుపై TAFRC కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అదనపు ఫీజు వసూళ్లు.. TAFRC సంచలన హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అదనంగా ఎలాంటి రుసుములు వసూలు చేసినా అది చట్టవిరుద్ధమని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల క్రమబద్ధీకరణ కమిటీ (TAFRC) స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ అధికారిక నోటీసును విడుదల చేసింది.

ఒక్కో విద్యార్థిపై రూ.2 లక్షల జరిమానా..

అయితే, అడ్మిషన్ ఫీజు, ఎన్‌బీఏ ఫీజు, స్పెషల్ ఫీజు, కేరియర్ డెవలప్‌మెంట్ ఫీజు, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ (CRT), యూనిఫాం ఫీజుల పేరుతో కొన్ని యాజమాన్యాలు అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నట్లుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు TAFRC తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల ద్వారా అనుమతించిన ఫీజు కంటే ఏ పేరుతో అదనంగా వసూలు చేసినా దానిని ‘క్యాపిటేషన్ ఫీజు’గానే పరిగణిస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అదనపు ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఉల్లంఘనకు పాల్పడే విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలతో పాటు, నిబంధనలు పాటించని కాలేజీలకు ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన ఆధారాలతో నేరుగా TAFRC కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని కమిటీ సూచించింది.

Next Story