ప్రకృతి సూపర్ హీరోలు గబ్బిలాలే.. డీఎన్ఏ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి

by Taduka Kalyani |

ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధకులు దేశంలోనే తొలిసారిగా డీఎన్ఏ మెటాబార్‌కోడింగ్ సాంకేతికతను ఉపయోగించి గబ్బిలాల ఆహారంపై నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రకృతి సూపర్ హీరోలు గబ్బిలాలే.. డీఎన్ఏ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి
X

దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధకులు దేశంలోనే తొలిసారిగా డీఎన్ఏ మెటాబార్‌కోడింగ్ సాంకేతికతను ఉపయోగించి గబ్బిలాల ఆహారంపై నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో నివసిస్తున్న అంతరించిపోతున్న గబ్బిలాలు వేలాది కీటకాలను ఆహారంగా తీసుకుంటూ పంటలను, ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తున్నాయని పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన జర్నల్ ఆఫ్ థ్రెటెండ్ టాక్సాలో ప్రచురితమైంది. కోలార్‌లోని హనుమనహళ్లి గుహలో నివసిస్తున్న నాలుగు రకాల ఆకు-ముక్కు గబ్బిలాలపై ఈ అధ్యయనం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన కోలార్ రౌండ్‌లీఫ్ బ్యాట్కు ఈ గుహే ఏకైక నివాసంగా ఉండగా, ఈ జాతి జనాభా ప్రస్తుతం 300 కంటే తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. డీఎన్ఏ విశ్లేషణ ద్వారా గబ్బిలాల ఆహారాన్ని పరిశీలించగా, ఒక్క కోలార్ రౌండ్‌లీఫ్ గబ్బిలమే 4,100కు పైగా కీటకాల జాతులను ఆహారంగా తీసుకుంటుందని తేలింది. ఇతర గబ్బిలాలు కూడా 1,200 నుంచి 2,400 వరకు కీటకాల జాతులను తింటున్నట్లు గుర్తించారు.

వీటిలో డెంగ్యూ, మలేరియా వ్యాప్తికి కారణమయ్యే దోమలు, టమాటా వంటి పంటలకు నష్టం కలిగించే కీటకాలు, బ్యాక్టీరియా, వైరస్‌లను వ్యాప్తి చేసే పురుగులు కూడా ఉన్నాయి. అధ్యయన ప్రధాన రచయిత్రి డాక్టర్ భార్గవి శ్రీనివాసులు మాట్లాడుతూ, గబ్బిలాలపై అనేక అపోహలు ఉన్నప్పటికీ అవి సహజ జీవ నియంత్రికలుగా పనిచేస్తూ వ్యవసాయానికి, ప్రజారోగ్యానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నాయని తెలిపారు. సహ రచయిత డాక్టర్ ఆదిత్య శ్రీనివాసులు మాట్లాడుతూ, గబ్బిలాల ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడం వాటి పరిరక్షణకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వైల్డ్‌లైఫ్ బయాలజీ అండ్ టాక్సోనమీ ల్యాబ్ అధిపతి ప్రొఫెసర్ చెల్మల శ్రీనివాసులు మాట్లాడుతూ, భారతదేశంలో గబ్బిలాల ఆహారంపై డీఎన్ఏ మెటాబార్‌కోడింగ్ ద్వారా నిర్వహించిన తొలి అధ్యయనం ఇదేనని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం పరిశోధక బృందాన్ని అభినందిస్తూ, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలను విశ్వవిద్యాలయం మరింత ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ పరిశోధన గబ్బిలాల పరిరక్షణ అనేది కేవలం ఒక జీవజాతిని కాపాడటం మాత్రమే కాకుండా, వ్యవసాయం, ప్రజారోగ్యం, పర్యావరణ సమతుల్యతను రక్షించడంలో కూడా కీలకమని స్పష్టం చేసింది.

Next Story