పులుల సంరక్షణలో అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంత సత్తా

by Kodari Anjali |

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమలలో పులుల సంరక్షణ, అటవీ రక్షణ, జీవవైవిధ్య పరిరక్షణలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.

పులుల సంరక్షణలో అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంత సత్తా
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమలలో పులుల సంరక్షణ, అటవీ రక్షణ, జీవవైవిధ్య పరిరక్షణలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. విశిష్ట సేవలు అందించిన 23 మంది అటవీ అధికారులు, సిబ్బంది జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిష్ఠాత్మక ప్రతిభా పురస్కారాలకు ఎంపిక కావడం విశేషం.

"ఎక్సలెన్స్ ఇన్ పర్‌ఫార్మెన్స్” పురస్కారాలకు...

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) ఆధ్వర్యంలో జూలై 29న న్యూఢిల్లీలో నిర్వహించనున్న గ్లోబల్ టైగర్ డే జాతీయ వేడుకల్లో “ఎక్సలెన్స్ ఇన్ పర్‌ఫార్మెన్స్” పురస్కారాలకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు చెందిన ముగ్గురు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఎం. మమత, పర్వీన్ బేగం, కె. తేజశ్రీ ఎంపికయ్యారు. పులుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, అటవీ సంరక్షణలో వీరు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేయనున్నారు. అదే సందర్భంగా హైదరాబాద్‌లోని దూలపల్లిలో గల తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ (టీఎస్‌ఎఫ్‌ఏ)లో నిర్వహించే రాష్ట్రస్థాయి గ్లోబల్ టైగర్ డే వేడుకల్లో ప్రదానం చేయనున్న “అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్” కోసం నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ శాఖకు చెందిన 20 మంది అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు.

రేంజ్ నుండి సఫారీ డ్రైవర్లు, యానిమల్ రెస్క్యూయర్ల వరకు...

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అచ్చంపేట, కొల్లాపూర్, మన్ననూర్, అమ్రాబాద్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, వైల్డ్‌లైఫ్ బయాలజిస్టులు, యానిమల్ ట్రాకర్లు, బేస్ క్యాంప్ వాచర్లు, సఫారీ డ్రైవర్లు, యానిమల్ రెస్క్యూయర్లు తదితర విభాగాలకు చెందిన సిబ్బంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో ముగ్గురు, రాష్ట్ర స్థాయిలో 20 మంది చొప్పున మొత్తం 23 మంది అటవీ అధికారులు, సిబ్బంది ప్రతిభా పురస్కారాలకు ఎంపిక కావడం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా నిలిచింది. పులుల సంరక్షణలో ఫ్రంట్‌లైన్ అటవీ సిబ్బంది చూపుతున్న అంకితభావం, విధి నిర్వహణలో నిబద్ధత, అక్రమ వేట నిరోధంలో వారి అప్రమత్తతకు ఈ పురస్కారాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఇబ్బంది నిరంతర కృషి అంకితభావమే..

నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర, ఐఎఫ్‌ఎస్ మాట్లాడుతూ.. అటవీ సిబ్బంది నిరంతర కృషి, అంకితభావం, పులులు–వన్యప్రాణుల సంరక్షణలో సాధించిన ఫలితాలకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలుస్తాయని తెలిపారు. ఈ ఘనత తెలంగాణ అటవీ శాఖకు, ముఖ్యంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు జాతీయ, రాష్ట్ర స్థాయిలో మరింత ప్రతిష్ఠను తీసుకొస్తుందని పేర్కొన్నారు.

Next Story