మెగా డీఎస్సీ-2025పై హైకోర్టులో పిల్.. సీబీఐ విచారణకు వైసీపీ ఎమ్మెల్సీ డిమాండ్!

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మెగా డీఎస్సీ-2025’ నియామక ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి.

మెగా డీఎస్సీ-2025పై హైకోర్టులో పిల్.. సీబీఐ విచారణకు వైసీపీ ఎమ్మెల్సీ డిమాండ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మెగా డీఎస్సీ-2025’ నియామక ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. డీఎస్సీ నియామకాల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై ఏకంగా సీబీఐ (CBI) తో లేదా ఏదైనా స్వతంత్ర సంస్థతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

సంచలన ఆరోపణలు..

పేపర్ లీకేజీ, మెరిట్ జాబితాల తారుమారు, స్పోర్ట్స్ కోటాలో భారీ గోల్‌మాల్ జరిగిందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నియామకాల్లో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్స్ 14 (చట్టం ముందు సమానత్వం), 16 (ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం) ల స్పష్టమైన ఉల్లంఘన అని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాధారాలు మాయం కాకుండా ఉండేందుకు.. డీఎస్సీ-2025కి సంబంధించిన అన్ని రకాల ఫైళ్లు, సర్వర్లు, డిజిటల్ రికార్డులను తక్షణమే భద్రపరిచేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

స్పోర్ట్స్ కోటాపై విచారణ..

క్రీడా కోటా ముసుగులో జరిగిన నియామకాలపై లోతైన విచారణ జరిపి, ఆ అక్రమ నియామకాలను తక్షణమే రద్దు చేయాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని పిటిషనర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story