సేఫ్ సిటీ లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలి: ఎంఎంసీ కమిషనర్

by Kodari Anjali |

సేఫ్ సిటీ ప్రాజెక్టు అమలుపై అధికారులతో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు.

సేఫ్ సిటీ లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలి: ఎంఎంసీ కమిషనర్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: సేఫ్ సిటీ లక్ష్యాల సాధనకు సమన్వయంతో పనిచేయాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలో సేఫ్ సిటీ ప్రాజెక్టు అమలును మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం తార్నాకాలోని ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పురోగతి, వివిధ అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎంఎంసీ పరిధిలోని ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ, పర్యవేక్షణను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలను సత్వరమే పరిష్కరించడం, రహదారి భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం కార్పొరేషన్‌లో ప్రత్యేక ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు అంశంపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సేఫ్ సిటీ లక్ష్యాల సాధనలో అన్ని శాఖలు సమిష్టిగా పనిచేసి ప్రజల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు రాధికా గుప్తా, సంచిత్ గంగ్వార్, వికాస్ మహతో, ఇంచార్జి చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు, ఇంజినీరింగ్ అధికారులు రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, రోహిణి, మాధవి లత, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story