హుస్సేన్ సాగర్ చుట్టూ ఎలివేటెడ్ సైకిల్ ట్రాక్..! ఉమ్టా సంచలన నిర్ణయాలు

by Ramesh Naini |

హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా(హెచ్ఎంఏ)లో పటిష్టమైన రవాణా వ్యవస్థ, సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేసే దిశగా 'హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ' కీలక ముందడుగు వేసింది.

హుస్సేన్ సాగర్ చుట్టూ ఎలివేటెడ్ సైకిల్ ట్రాక్..! ఉమ్టా సంచలన నిర్ణయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా(హెచ్ఎంఏ)లో పటిష్టమైన రవాణా వ్యవస్థ, సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేసే దిశగా 'హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ' కీలక ముందడుగు వేసింది. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఐదు వర్కింగ్ గ్రూపుల చైర్మన్‌లతోపాటు ఉన్నతాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి.కర్ణన్, సీఎంసీ కమిషనర్ సృజన, ఎంఎంసీ కమిషనర్ విసయ్ కృష్ణారెడ్డి, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మహానగర రవాణా ప్రాజెక్టులను వేగవంతం చేయడంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వివిధ వర్కింగ్ గ్రూప్‌ల సిఫార్సులను తుది ఆమోదం, అమలు కోసం ఉమ్టా మెయిన్ కమిటీ ముందు ఉంచనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ జీవన్ బాబు తెలిపారు. ఈ సమీక్షలు నగరంలో సురక్షితమైన, వేగవంతమైన, పర్యావరణహిత రవాణా వ్యవస్థను అందించడానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

విధానాలు, ప్రణాళికలు & స్మార్ట్ అర్బన్ మొబిలిటీ..

స్మార్ట్ అర్బన్ మొబిలిటీ వర్కింగ్ గ్రూపులో ముఖ్యంగా అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ఫండ్ (యూటీఎఫ్) గురించి ప్రత్యేకంగా చర్చించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా కోసం ప్రత్యేక 'అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ఫండ్' ఏర్పాటుకు హెచ్ఎండీఏ చట్టం ప్రకారం ఎస్క్రో అకౌంట్ ను వినియోగించాలని నిర్ణయించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ పర్యాటక ప్రాంతాలు, రవాణా కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక ఎలివేటెడ్ సైకిల్ వాక్ నిర్మాణంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) సైకిల్ ట్రాక్‌ను సమీప ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. 51 ఎంఎంటిఎస్ స్టేషన్లలో మల్టీ-మోడల్ ఇంటిగ్రేషన్ (ఎంఎంఐ) ప్రణాళికలు, మెట్రో స్టేషన్లకు ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. మల్టీ-లెవెల్ కార్ పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్, నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ పార్కింగ్, వెండింగ్, 'తెలంగాణ స్టేట్ రోప్‌వే పాలసీ' రూపకల్పన వంటి విధివిధానాలను రూపొందించాలని చర్చించారు.

రోడ్డు అభివృద్ధి, ట్రాఫిక్ రవాణా ప్రతిపాదనలు..

నగరంలో పాదచారుల భద్రత కోసం ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, హైటెక్ సిటీ, ఐకియా వద్ద కొత్త స్కైవాక్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలను పీపీపీ/ సీఎస్ఆర్ భాగస్వామ్యంతో ప్రజా సౌకర్యాలు, పార్కింగ్, వెండింగ్ జోన్లు, వాణిజ్య కియోస్క్‌లుగా మలచడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా అమీర్‌పేట్ జంక్షన్, సత్యం థియేటర్ జంక్షన్‌లలో ప్రత్యేక వెండింగ్ జోన్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం స్థానిక సంస్థల భాగస్వామ్యంతో నగరం నలుమూలలా ఉన్న 12 జోన్లలో దీనిని విస్తరించాలని నిర్ణయించారు.

ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్..

ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్(ఐటీఎంఎస్)లో భాగంగా 'ట్రాఫిక్యూర్' అనే సమగ్ర ట్రాఫిక్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. కేబీఆర్ పార్క్, జీవీకే-నానల్ నగర్ కారిడార్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయించారు. నగరంలో డిజిటల్ విధానంలో ఏ రవాణా సాధనంలోనైనా ప్రయాణించేలా 'మీ టికెట్' కామన్ టికెటింగ్ విధానం అమలు చేయడానికి చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించారు.

Next Story