- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగేళ్లుగా నరకయాతన.. నిద్రపోతున్న ఆర్ అండ్ బీ అధికారులు !
మోమిన్‌పేట్ మండలంలోని కేసారం రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తై నాలుగేళ్లు గడుస్తున్నా, అక్కడి రహదారి సమస్య మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదు.

దిశ, మోమిన్‌పేట్ : మోమిన్‌పేట్ మండలంలోని కేసారం రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తై నాలుగేళ్లు గడుస్తున్నా, అక్కడి రహదారి సమస్య మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో తవ్విన మట్టిని రహదారికి ఇరువైపులా పోయడంతో వర్షపు నీరు వెళ్లే మార్గం లేక రోడ్డుపైనే నిలిచిపోతోంది. దీంతో రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడి, ప్రయాణికులకు నిత్యం ప్రాణాపాయంగా మారింది. వర్షం పడితే ఈ రహదారి చెరువును తలపిస్తోంది. గుంతలు నీటిలో కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే పలువురు గుంతల్లో పడి గాయపడినా సంబంధిత ఆర్ అండ్ బి శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
ప్రజల నుంచి ఎన్నిసార్లు ఫిర్యాదులు వెళ్లినా అధికారులు ఒక్కసారి కూడా స్థలాన్ని పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజల ప్రాణాలకు విలువ లేదా.. ప్రమాదాలు జరిగాకే స్పందిస్తారా? అంటూ స్థానికులు నిలదీస్తున్నారు. రహదారికి ఇరువైపులా పోసిన మట్టిని వెంటనే తొలగించి, వర్షపు నీరు వెళ్లేలా శాశ్వత డ్రైనేజీ ఏర్పాటు చేసి, పూర్తిగా కొత్త బీటీ రహదారిని నిర్మించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై కూడా అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే ప్రజలతో కలిసి భారీ ఆందోళన చేపట్టి రహదారిపైనే నిరసనకు దిగుతామని ప్రయాణికులు తీవ్ర హెచ్చరిక చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.






