సింగరేణిలో సమ్మె సైరన్..!

by Ratna Kumari |

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై కేంద్ర కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) డాక్టర్ సస్వతీ రాథ్ సమక్షంలో మంగళవారం హైదరాబాద్‌లో రెండో విడత చర్చలు జరిగాయి.

సింగరేణిలో సమ్మె సైరన్..!
X

దిశ, కొత్తగూడెం సింగరేణి : సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై కేంద్ర కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) డాక్టర్ సస్వతీ రాథ్ సమక్షంలో మంగళవారం హైదరాబాద్‌లో రెండో విడత చర్చలు జరిగాయి. మెడికల్ బోర్డు, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లపై ఇరు పక్షాల మధ్య విస్తృతంగా చర్చించారు. ఏఐటీయూసీ తరఫున అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎం.రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు కె.వీరభద్రయ్య, వై.వి. రావు, ఎం.సమ్మయ్య పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం తరఫున డిప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) బి. రాజగోపాల్ హాజరయ్యారు.

రీ-మెడికల్ నిర్వహించాలన్న సూచన..

సమ్మె నోటీసులో ప్రధాన అంశమైన మెడికల్ బోర్డు పరీక్షలపై ఏఐటీయూసీ తమ అభ్యంతరాలను ఆర్‌ఎల్‌సీ దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డులో కార్మికులను పారదర్శకంగా ఫిట్ లేదా అన్‌ఫిట్‌గా ప్రకటించకపోవడంతో అనేక మందికి అన్యాయం జరిగిందని సంఘం ఆరోపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డాక్టర్ సస్వతీ రాథ్, ఈ నెల 17, 18 తేదీల్లో మెడికల్ బోర్డు పరీక్షలకు హాజరైన కార్మికులకు రీ-మెడికల్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సింగరేణి యాజమాన్యానికి సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు తావులేకుండా మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలని కూడా స్పష్టం చేశారు.

ఆగస్టు 6న తదుపరి విచారణ..

తదుపరి విచారణకు ముందే సింగరేణి యాజమాన్యం, ఏఐటీయూసీ మధ్య ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి, సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని డిమాండ్లపై సానుకూలంగా చర్చించి ఆ సమావేశ నివేదికను సమర్పించాలని ఆర్‌ఎల్‌సీ ఆదేశించారు. నిర్ణయాధికారం కలిగిన అధికారిని తదుపరి సమావేశానికి తప్పనిసరిగా హాజరుపరచాలని సూచించారు. తదుపరి విచారణను **ఆగస్టు 6, 2026 ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

ఆగస్టు 16 నుంచి నిరవధిక సమ్మె హెచ్చరిక..

చర్చల అనంతరం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, ఆగస్టు 6లోగా కార్మికుల సమస్యలకు సానుకూల పరిష్కారం లభించకపోతే ఆగస్టు 16 నుంచి సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. దీంతో సింగరేణిలో కార్మిక సమస్యల పరిష్కారంపై ఉత్కంఠ నెలకొంది.

Next Story