- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూభారతిలో కీలక అడుగు.. రెండు గ్రామాల్లో భూముల రీసర్వే ప్రారంభం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని నంబాల గ్రామ పంచాయతీ పరిధిలోని ఫకీర్‌పల్లి, రోల్లపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని సీతానగర్ గ్రామాల్లో భూభారతి కింద భూముల రీసర్వే ప్రారంభమైనట్లు మండల తహసీల్దార్ పి. సూర్యప్రకాశ్ తెలిపారు.

దిశ, రెబ్బెన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని నంబాల గ్రామ పంచాయతీ పరిధిలోని ఫకీర్‌పల్లి, రోల్లపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని సీతానగర్ గ్రామాల్లో భూభారతి కింద భూముల రీసర్వే ప్రారంభమైనట్లు మండల తహసీల్దార్ పి. సూర్యప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రీసర్వే అంటే గతంలో నిర్వహించిన భూసర్వేను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పునఃపరిశీలించి, భూముల హద్దులు, యాజమాన్య మార్పులు, కుటుంబ విభజనలు, కొనుగోలు–అమ్మకాల వివరాలను నమోదు చేసి, అవసరమైన చోట ఉపసర్వే నంబర్లు కేటాయించి నూతన డిజిటల్ మ్యాప్ రూపొందించే ప్రక్రియ అని వివరించారు. 1920–1956 మధ్య అప్పటి నిజాం ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూసర్వే ఆధారంగానే ప్రస్తుతం భూ రికార్డులు కొనసాగుతున్నాయని తెలిపారు.
అనంతర కాలంలో కుటుంబ విభజనలు, వారసత్వ బదిలీలు, కొనుగోలు–అమ్మకాల కారణంగా ఒకే సర్వే నంబర్‌లో పలువురు యజమానులు ఉన్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో భూభారతి కింద రీసర్వే నిర్వహించి, భూముల వాస్తవ హద్దులను నిర్ధారించడంతో పాటు అవసరమైన చోట ఉపసర్వే నంబర్లు కేటాయించి డిజిటల్ మ్యాప్‌లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రీసర్వే వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, భూ రికార్డులు మరింత స్పష్టంగా, పారదర్శకంగా మారుతాయని తహసీల్దార్ పేర్కొన్నారు. ఫకీర్‌పల్లి, సీతానగర్ గ్రామాల రైతులు సర్వే జరిగే సమయంలో తప్పనిసరిగా తమ భూముల వద్ద హాజరై రెవెన్యూ అధికారులు, సర్వేయర్లకు పూర్తి సహకారం అందించాలని కోరారు. రైతుల సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ఉదయకిరణ్, ఆర్‌ఐ సౌమ్య, మండల సర్వేయర్ అజయ్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.






