ప్రతిభకు మెరిట్ అవార్డులు.. విద్యార్థినులను అభినందించిన అదనపు కలెక్టర్

by Kodari Anjali |

ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదువాలని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ విద్యార్థులకు సూచించారు.

ప్రతిభకు మెరిట్ అవార్డులు.. విద్యార్థినులను అభినందించిన అదనపు కలెక్టర్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదువాలని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఉప్పల్, మల్కాజిగిరి లలోని టీఎంఆర్‌ఈఐఎస్ బాలికల పాఠశాలలను ఆకస్మికంగా అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థినులకు మెరిట్ అవార్డులు అందజేసి అభినందించారు. అలాగే 5వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థినులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. సందర్శనలో భాగంగా తరగతి గదులు, వసతి గృహాలు, భోజనశాల, వంటశాల, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రత తదితర మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదవాలని, చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొని సమగ్ర వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలిస్తూ, నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జి. కాంతమ్మ, పాఠశాల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story