TRAI: 134.8 కోట్లకు చేరిన టెలికాం యూజర్లు

by S Gopi |

ఒక్క నెలలో 62 లక్షల మంది కొత్త యూజర్లు చేరగా, అందులో దాదాపు 87 శాతం అంటే 54.54 లక్షల మంది కేవలం భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లనే ఎంచుకున్నారు.

TRAI: 134.8 కోట్లకు చేరిన టెలికాం యూజర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం మార్కెట్‌లో ప్రైవేట్ కంపెనీల ఆధిపత్యం మరింత బలపడుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన జూన్ నెల గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం టెలికాం వినియోగదారుల సంఖ్య 134.8 కోట్లకు చేరింది. ఒక్క నెలలో 62 లక్షల మంది కొత్త యూజర్లు చేరగా, అందులో దాదాపు 87 శాతం అంటే 54.54 లక్షల మంది కేవలం భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లనే ఎంచుకున్నారు. ఎయిర్‌టెల్ అత్యధికంగా 31.63 లక్షల కొత్త వినియోగదారులను చేర్చుకుని మొదటి స్థానంలో నిలవగా, జియో 22.91 లక్షల కొత్త కనెక్షన్లతో రెండో స్థానంలో నిలిచింది. వొడాఫోన్ ఐడియా స్వల్పంగా 1.63 లక్షల వైర్‌లెస్ కస్టమర్లను చేర్చుకోగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్‌కు 94 వేల మంది కొత్త మొబైల్ కస్టమర్లు లభించారు. మరో టెలికాం సంస్థ ఎంటీఎన్ఎల్ మాత్రం వినియోగదారులను కోల్పోయింది. వైర్‌లెస్ విభాగంలో మొత్తం కనెక్షన్లు 130 కోట్లకు చేరగా, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల సంఖ్య కూడా 108.75 కోట్లకు పెరిగింది. ఈ విభాగంలో 53.22 కోట్ల యూజర్లతో రిలయన్స్ జియో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 37.99 కోట్లతో ఎయిర్‌టెల్ రెండో స్థానంలో ఉంది. తాజా గణాంకాలను చూస్తే, టెలికాం మార్కెట్‌లో కొత్త వినియోగదారులను చేర్చుకునే పోటీ ప్రస్తుతం ప్రధానంగా జియో, ఎయిర్‌టెల్ మధ్యే సాగుతున్నట్లు స్పష్టమవుతోందని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొన్నారు.

Next Story