- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ద చెరువు’ బఫర్ అంశంపై అధికారుల మౌనంపై విమర్శలు
హైడ్రా, రెవెన్యూ ఉమ్మడి సర్వేతో వాస్తవాలు వెలుగులోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలం గాగిల్లాపూర్ పరిధిలో ప్రైవేటు నిర్మాణ సంస్థ కాసా గ్రాండ్ చేపట్టిన ‘సియెర్రా’ విల్లా ప్రాజెక్టు మరోసారి వివాదంలో నిలిచింది. అధికారిక ఎన్‌ఓసీ ప్రకారం రెండు చెరువుల బఫర్ జోన్‌కు కలిపి 34.50 గుంటల భూమిని నిర్మాణాలకు మినహాయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం దుండిగల్ పెద్ద చెరువు 30 మీటర్ల బఫర్ పరిధిలోకి విల్లాలు, ఎమినిటీస్, గ్రీన్ ఏరియా అభివృద్ధి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోతినారు చెరువు కట్ట ధ్వంసంపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో, పక్కనే ఉన్న పెద్ద చెరువు బఫర్ పరిధిలో జరుగుతున్నట్లు చెబుతున్న నిర్మాణాలపై సంబంధిత శాఖలు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు, పర్యావరణవేత్తలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఎన్‌ఓసీలో 34.50 గుంటల బఫర్ మినహాయింపు
నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2019లో జారీ చేసిన అధికారిక క్లియరెన్స్ (Lr. No: EE/IB/HYD/DB/HD/D1/2019-20/1090/3NON) ప్రకారం, ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం 9 ఎకరాల 36.22 గుంటల భూమి రెండు నీటి వనరుల పరివాహక ప్రాంతంలో ఉంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సంయుక్త పరిశీలన ఆధారంగా దుండిగల్ పెద్ద చెరువు బఫర్ జోన్‌లో 18.50 గుంటలు, కోతినారు చెరువు బండ్ బఫర్ పరిధిలో 16.00 గుంటలు కలిపి మొత్తం 34.50 గుంటల భూమిని నిర్మాణాలకు అనర్హంగా గుర్తించారు. దీంతో కేవలం 9 ఎకరాల 1.72 గుంటల భూమిలో మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఇస్తూ ఎన్‌ఓసీ జారీ చేసినట్లు అధికారిక పత్రాలు పేర్కొంటున్నాయి.
కాగితాల్లో బఫర్.. క్షేత్రస్థాయిలో నిర్మాణాలా..?
ఎన్‌ఓసీలో బఫర్ ప్రాంతాన్ని స్పష్టంగా మినహాయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద చెరువు 30 మీటర్ల బఫర్ జోన్‌ను దాటి ప్రాజెక్టుకు చెందిన విలాసవంతమైన ఎమినిటీస్, గ్రీన్ ఏరియాలు, కొన్ని విల్లాల నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న సాటిలైట్ డిజిటల్ చిత్రాలను పరిశీలించినా బఫర్ పరిధిలో నిర్మాణాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు చెబుతున్నారు. అయితే ఈ అంశాన్ని సంబంధిత శాఖలు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
కోతినారుపై కేసు... పెద్ద చెరువుపై ఎందుకు మౌనం..?
కోతినారు చెరువు కట్టను దెబ్బతీసి గ్రావెల్ తరలించారన్న ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారుల నివేదిక ఆధారంగా దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో FIR No.628/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు *329(3), 324(4)*తో పాటు పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం చెరువు కట్ట పునరుద్ధరణ చర్యలు కూడా చేపట్టారు. అయితే అదే ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న పెద్ద చెరువు బఫర్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
సాటిలైట్ చిత్రాల్లో బయటపడుతున్న ఆక్రమణ ఆరోపణలు
దుండిగల్ పెద్ద చెరువుకు సంబంధించిన A-32 నుంచి A-36 కో-ఆర్డినేట్ల మధ్య బఫర్ పరిధిలో నిర్మాణాలు జరిగినట్లు సాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత శాఖలు సాంకేతిక సర్వే నిర్వహించి వాస్తవ పరిస్థితిని ప్రజలకు వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
హైడ్రా మార్కింగ్ చేస్తుందా..?
హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణతో పాటు రెండు చెరువుల బఫర్ జోన్‌ల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టులో కోట్ల రూపాయల విలువైన విల్లాల విక్రయాలు కొనసాగుతున్న నేపథ్యంలో, అధికారిక ఎన్‌ఓసీ సరిహద్దుల ఆధారంగా హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఉమ్మడి సర్వే నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. పెద్ద చెరువు 30 మీటర్ల బఫర్ జోన్‌కు క్షేత్రస్థాయిలో మార్కింగ్ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా నిర్మాణాలు జరిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తద్వారా అమాయక కొనుగోలుదారుల ప్రయోజనాలను కూడా పరిరక్షించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.






