పాలమూరు ప్రజలను అవమానిస్తున్న పీయూ వైస్ ఛాన్సలర్ తప్పుకోవాలి

by Kodari Anjali |

విజన్ ఇండియా-2047 ను పీయూలోనే నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

పాలమూరు ప్రజలను అవమానిస్తున్న పీయూ వైస్ ఛాన్సలర్ తప్పుకోవాలి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన 'విజన్ ఇండియా-2047' జాతీయ సదస్సును, హైదరాబాద్ సమీపంలోని 'కన్హ శాంతివనం'లో నిర్వహించడానికి పూనుకొని ఉమ్మడి జిల్లా ప్రజలను అవమానపరుస్తున్న పాలమూరు యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ జి. శ్రీనివాస్ తప్పుకోవాలని మేధావులు, విద్యావేత్తలు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు ఏక కంఠంతో తీర్మానించారు. మంగళవారం స్థానిక రెడ్ క్రాస్ భవనంలో టిపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్థన్ రెడ్డి అధ్యక్షతన 'పాలమూరు పునఃనిర్మాణం ఫోరం' ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మేధావులు, విద్యావేత్తలు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు పాల్గొని ప్రసంగించారు. దేశంలోని వెయ్యికి పైగా ఉన్న యూనివర్సిటీల్లో 'విజన్ ఇండియా-2047' సదస్సును పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించడానికి అవకాశం వస్తే, కుంటి సాకులతో ఎక్కడో 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'కన్హ శాంతివనం'లో నిర్వహించి, పాలమూరును అప్రతిష్టపాలు చేయడానికి పీయూ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ కుట్ర పన్నారని వక్తలు ఆరోపించారు.

సదస్సును పాలమూరు యూనివర్సిటీలో

సాక్షాత్తు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి స్వంత ఉమ్మడి జిల్లా, 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఉండగా, సదస్సును ఇక్కడ నిర్వహించకుండా వీసీ శ్రీనివాస్ ఏకపక్ష నిర్ణయం సరికాదని ఆక్షేపించారు. ఇతర రాష్ట్రానికి చెందిన 'కన్హ శాంతివనం' కు 1400 ఎకరాల భూమి ఎందుకని, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సమావేశంలో వక్తలు ప్రతిపాదించారు. సదస్సును పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించాలనే ఏకగ్రీవ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డికి పంపుతున్నట్లు సమావేశంలో నిర్ణయించారు‌. ఈ కార్యక్రమంలో పాలమూరు అద్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, జెపిఎన్సీఈ చైర్మెన్ కెఎస్ రవికుమార్, న్యాయవాది వీరబ్రహ్మచారి, టిపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, సాయిబాబా, ఫారుక్ హుసేన్, అంజయ్యాచారి, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story