- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రమశిక్షణకు చిరునామా గంగాపూర్ కేజీబీవీ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) క్రమశిక్షణ, నాణ్యమైన విద్య, ఉత్తమ ఫలితాలు, మెరుగైన వసతులతో జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.

దిశ, రెబ్బెన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) క్రమశిక్షణ, నాణ్యమైన విద్య, ఉత్తమ ఫలితాలు, మెరుగైన వసతులతో జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. విద్యలోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థినులు ప్రతిభ కనబరుస్తూ విద్యాలయానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. విద్యాలయ ప్రత్యేక అధికారి పద్మ మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలో 202 మంది, జూనియర్ కళాశాలలో 142 మంది విద్యార్థినులు ఉన్నారని తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 76 మంది, ద్వితీయ సంవత్సరంలో 66 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారని, మొత్తం విద్యార్థినుల సంఖ్య 344అని వెల్లడించారు.
2026 మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో ద్వితీయ సంవత్సరం ఫలితాలు 100 శాతం, ప్రథమ సంవత్సరం ఫలితాలు 98 శాతం నమోదయ్యాయని తెలిపారు. ఎస్‌ఎస్‌సీతో పాటు ఇంటర్మీడియట్‌లోనూ వంద శాతం ఫలితాలు సాధిస్తూ గంగాపూర్ కేజీబీవీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉత్తమ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంగా పేరు ప్రఖ్యాతలు పొందిందన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో వి.సంజన (బైపీసీ) 980 మార్కులు, పవిత్ర (ఎంపీసీ) 954 మార్కులు సాధించి ప్రతిభ చాటగా, ప్రథమ సంవత్సరంలో ఎన్. శ్రుతి (బైపీసీ) 426 మార్కులు, ఎన్.శ్రేయ (ఎంపీసీ) 456 మార్కులు సాధించి ఉత్తమ ఫలితాలు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు ప్రతిరోజూ నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వసతి, భద్రత, ఆరోగ్య సంరక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నారని, విద్యార్థినుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మికంగా విద్యాలయాన్ని సందర్శించి కిచెన్, భోజనశాల, తరగతి గదులు, హాస్టల్ తదితర సౌకర్యాలను పరిశీలించి నిర్వహణ, పరిశుభ్రత, క్రమశిక్షణ పై సంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గంగాపూర్ కేజీబీవీ జిల్లాలోని బాలికలకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఆదర్శ విద్యాసంస్థగా కొనసాగుతోంది.






