టీడీపీలో హాట్ టాపిక్‌గా బొండా ఉమా వ్యవహారం.. త్రిసభ్య కమిటీ ఎదుట వివరణ!

by Ramesh Naini |   (  Updated:2026-07-28 12:14:35  IST  )

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

టీడీపీలో హాట్ టాపిక్‌గా బొండా ఉమా వ్యవహారం.. త్రిసభ్య కమిటీ ఎదుట వివరణ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడంపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని, త్రిసభ్య కమిటీకి తన వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..?

ఇటీవల గుంటూరులో నిర్వహించిన ‘ముద్రగడ సంస్మరణ సభ’లో ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొన్నారు. అయితే, అదే సభకు వచ్చిన వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఆయన వేదిక పంచుకున్నారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని సన్నిహితంగా మాట్లాడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధిష్ఠానం భావించింది. ఈ పరిణామంపై ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. బొండా ఉమా వ్యవహారంపై విచారణ జరిపేందుకు తక్షణమే ఓ త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీ సభ్యులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, కిలారు రాజేశ్ ఉన్నారు.

విచారణకు హాజరైన బొండా ఉమా.

అధిష్టానం ఆదేశాల మేరకు మంగళవారం కేంద్ర కార్యాలయానికి రావాలని కమిటీ బొండా ఉమాకు పిలుపునిచ్చింది. దీంతో పార్టీ కార్యాలయానికి చేరుకున్న పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడుల ఎదుట విచారణకు ఆయన హాజరయ్యారు. అంబటితో కలిసి వేదిక పంచుకోవడంపై నేతలకు ఆయన తన వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.

Next Story