- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ మోసాలపై కేంద్రం ఉక్కుపాదం.. IDPIC పై పార్లమెంట్‍లో కేంద్రం కీలక ప్రకటన
సైబర్ మోసాలను అరికట్టేందుకు 'ఇండియా డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్' ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆన్‍లైన్ మోసాలను అరికట్టేందుకు 'ఇండియా డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్' (IDPIC)ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఏఐ, బిగ్ డేటాతో రియల్ టైమ్ అలర్ట్స్:
ఈ నూతన ఐడీపీఐసీ వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి అత్యంత ఆధునిక సాంకేతికతలను ఉపయోగించుకుని పని చేస్తుందని మంత్రి తెలిపారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుందని తన సమాధానంలో పేర్కొన్నారు. అనుమానాస్పద లావాదేవీలు లేదా సైబర్ బెదిరింపులు జరిగినప్పుడు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు వెంటనే అలర్ట్‌లను పంపుతుందనిన్నారు.
భద్రతను పెంచేందుకు మరిన్ని వ్యవస్థలు:
ఆర్థిక రంగంలో సైబర్ బెదిరింపులను తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రక్షణ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆధ్వర్యంలోని 'నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్' మెటాడేటా స్థాయిలో సైబర్ బెదిరింపులను ముందే పసిగట్టి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే, ఫైనాన్షియల్ సెక్టార్ కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న 'CSIRT-Fin' సైబర్ దాడుల సమాచారాన్ని సేకరిస్తూ బ్యాంకింగ్ రంగానికి తగిన మార్గదర్శకాలను అందిస్తోంది. దీనికి తోడు, వేర్వేరు ఆర్థిక నిబంధనల మధ్య సమన్వయం కోసం ఎఫ్ఎస్‍డీసీ పరిధిలో 'ఇంటర్-రెగ్యులేటరీ టెక్నికల్ గ్రూప్', కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలతో కూడిన 'ఐబీఏ వర్కింగ్ గ్రూప్' నిరంతరం శ్రమిస్తున్నాయని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.






