- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Plastic Currency: తొలిదశ రూ.10, రూ.20లో పాలిమర్ నోట్లు రెడీ
సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో కరెన్సీ నోట్ల మన్నికను పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 10, రూ. 20 డినామినేషన్లలో ఒక్కో దానిలో 100 కోట్ల (1 బిలియన్) పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను క్షేత్రస్థాయి ప్రయోగాత్మక పరిశీలన కోసం ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ సమర్పించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలియజేశారు. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే, భవిష్యత్తులో క్రమం తప్పకుండా ఈ పాలిమర్ నోట్లను జారీ చేయనున్నారు.
గ్లోబల్ టెండర్లు.. ప్రత్యేక భద్రతా ఫీచర్లు
పాలిమర్ కరెన్సీ ముద్రణ కోసం ఆర్‌బీఐ అనుబంధ సంస్థ అయిన 'భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్' ద్వారా ప్రత్యేక పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల తయారీకి గ్లోబల్ టెండర్ జారీ చేశారు. తక్షణ అవసరాల కోసం 3.4 కోట్ల పాలిమర్ షీట్లను సరఫరా చేయాలని టెండర్‌లో పేర్కొన్నారు. ఈ షీట్లు కేవలం ప్లాస్టిక్ రకాలు మాత్రమే కాకుండా, అనేక రకాల అధునాతన భద్రతా ఫీచర్లతో రూపొందనున్నాయి. ఈ టెండర్లలో బిడ్లు సమర్పించడానికి ఆగస్టు 18ని తుది గడువుగా నిర్ణయించారు.
కాగితపు నోట్లు రద్దు కావు
కొత్తగా పాలిమర్ నోట్లను ప్రవేశపెడుతున్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కాగితపు నోట్లను తొలగించే ప్రణాళిక ఏదీ లేదని, రెండూ సమాంతరంగా చలామణిలో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలిమర్ నోట్లు తేమ, మురికి, నలిగిపోవడానికి వీల్లేకుండా, సుదీర్ఘకాలం నాణ్యతతో ఉంటాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పాలిమర్ కరెన్సీ విజయవంతంగా వినియోగంలో ఉంది. ఆర్‌బీఐ జారీ చేసే ఈ పాలిమర్ నోట్ల ప్రభావం డిజిటల్ చెల్లింపులపై ఎంతవరకు ఉంటుందనేది మార్కెట్లోకి వచ్చాకే తెలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.






