పచ్చ బంగారానికి మళ్లీ సింగారం..!

by Ratna Kumari |

'పచ్చ బంగారం'గా పేరొందిన పసుపు పంటకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లుగా కనిపిస్తోంది.

పచ్చ బంగారానికి మళ్లీ సింగారం..!
X

దిశ, నిజామాబాద్ అర్బన్ : 'పచ్చ బంగారం'గా పేరొందిన పసుపు పంటకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లుగా కనిపిస్తోంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రస్తుతం పసుపు క్వింటాకు గరిష్టంగా రూ.21 వేల వరకు ధర పలుకుతుండగా, నమూనా ధర రూ.16 వేలు, కనిష్ట ధర రూ.10 వేలు నమోదవుతోంది. ఈ నెల తొలి వారంలో గరిష్ట ధర రూ.18 వేల వరకు ఉండగా, నాలుగో వారానికి రూ.21 వేలకు చేరుకోవడం రైతులు, వ్యాపారుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. వ్యాపార వర్గాల అంచనా ప్రకారం అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడం వల్లే ధరలు పెరిగాయి. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డులో రోజుకు 2,000 నుంచి 3,000 క్వింటాళ్ల పసుపు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అయితే రైతులు ఇప్పటికే తమ వద్ద ఉన్న పంటలో సుమారు 80 శాతం విక్రయించగా, మిగిలిన నిల్వలు కొంతమంది రైతులు, వ్యాపారుల వద్ద ఉన్నాయి. దీంతో ధరల పెరుగుదలపై రైతుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

ధరలు పెరిగినా... సాగు విస్తీర్ణం మాత్రం తగ్గిందే..

దేశంలోనే పసుపు సాగుకు పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఒకప్పుడు సుమారు 36 వేల ఎకరాల్లో సాగు జరిగే ఈ పంట ప్రస్తుతం సుమారు 25 వేల ఎకరాలకు పరిమితమైంది. ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వేల్పూర్, బాల్కొండ, ముప్కల్, మెండోరా, కమ్మర్‌పల్లి, దొంకేశ్వర్, ఆలూర్, మోర్తాడ్, ఏర్గట్ల, మాక్లూర్, నందిపేట్ మండలాల్లో విస్తృతంగా సాగు జరిగేది. గత పదేళ్లుగా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపారు. క్వింటాకు నమూనా ధర రూ.7,500, గరిష్ట ధర రూ.10 వేలకే పరిమితమైన పరిస్థితుల్లో సాగు క్రమంగా తగ్గిపోయింది. గత ఏడాది 23,577 ఎకరాల్లో సాగు జరగగా, ఈ ఏడాది 25,767 ఎకరాలకు మాత్రమే పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరలను దృష్టిలో ఉంచుకుంటే ఈ పెరుగుదల కూడా చాలా తక్కువేనని వ్యవసాయ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

పసుపు బోర్డు ఏర్పాటైనా రైతుల ఆశలు నెరవేరలేదా..?

పసుపు పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న రైతుల డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేసి, జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినప్పటికీ, నాణ్యమైన వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులు, అవసరమైన రాయితీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఆర్మూర్ ప్రాంతంలో పండే పసుపు వంగడాలకు ఇతర రాష్ట్రాల వంగడాలతో పోలిస్తే తక్కువ నాణ్యత రావడం వల్ల ఆశించిన ధరలు దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి రావడం, గిట్టుబాటు ధరపై స్పష్టత లేకపోవడం కూడా సాగు తగ్గడానికి కారణమవుతోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సాగులో ఉన్న పంట మార్కెట్‌కు రావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుండటంతో, అప్పటి వరకు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే పసుపు రైతులకు మంచి లాభాలు చేకూరే అవకాశముందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Next Story