యూట్యూబ్ ప్రకటన నమ్మి రూ.72.69 లక్షల టోపీ..

by Batti.Sumithra |

తూప్రాన్‌కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో వచ్చిన స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ప్రకటనను నమ్మి ఆన్‌లైన్ సైబర్ మోసానికి గురై రూ.72,69,973 కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.

యూట్యూబ్ ప్రకటన నమ్మి రూ.72.69 లక్షల టోపీ..
X

దిశ, తూప్రాన్ : తూప్రాన్‌కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో వచ్చిన స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ప్రకటనను నమ్మి ఆన్‌లైన్ సైబర్ మోసానికి గురై రూ.72,69,973 కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూప్రాన్‌కు చెందిన కమ్మరి విఠలాచారి (47), నిరుద్యోగి, మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 19న యూట్యూబ్‌లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనను చూసిన ఆయన, "N114-Elite Chat Hub" అనే వాట్సాప్ గ్రూపులో చేరారు.

గ్రూపులో ఉన్న వ్యక్తులు తమను స్టాక్ మార్కెట్ సలహాదారులుగా పరిచయం చేసుకుని, నకిలీ ట్రేడింగ్ యాప్‌ను అసలైన Upstox యాప్‌గా నమ్మించి డౌన్‌లోడ్ చేయించారు. యాప్‌లో చూపించిన నకిలీ లాభాలను చూసి నమ్మిన విఠలాచారి, పెట్టుబడులు, ఇతర చార్జీల పేరుతో విడతల వారీగా మొత్తం రూ.72,69,973ను వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం తన పెట్టుబడి నగదును ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా, నిందితులు మరింత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు గ్రహించారు. దీంతో బాధితుడు జూలై 25న ఎన్‌సీఆర్‌పీ (NCRP) పోర్టల్‌లో అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్: 33707260035876 ద్వారా ఫిర్యాదు నమోదు చేయగా, అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి ప్రకటనలను నమ్మవద్దని, అధికారికంగా ధృవీకరించిన యాప్‌లు, సంస్థల ద్వారానే పెట్టుబడులు పెట్టాలని సైబర్ పోలీసులు ప్రజలకు సూచించారు.

Next Story