హైదరాబాద్ -విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ.. ఈ 6 ఫ్లై ఓవర్లే కారణమా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-11 09:50:59  IST  )

సంక్రాంతి పండగేమో కానీ.. పండక్కి సొంతూళ్లో ఉండాలని బయల్దేరిన ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుని నానా తంటాలు పడుతున్నారు.

హైదరాబాద్ -విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ.. ఈ 6 ఫ్లై ఓవర్లే కారణమా?
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండగేమో కానీ.. పండక్కి సొంతూళ్లో ఉండాలని బయల్దేరిన ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుని నానా తంటాలు పడుతున్నారు. పంతంగి, చిల్లకల్లు టోల్ గేట్స్, హైదరాబాద్ - విజయవాడ, హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్ - వరంగల్ హైవేలపై భారీ సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. టోల్ ప్లాజాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం నిమిషానికి 47 వాహనాలు టోల్ క్రాస్ చేస్తున్నాయి. గడిచిన 18 గంటల్లో లక్షా 60 వేల వరకూ వాహనాలు ఏపీ వైపు వెళ్లాయి. ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్తున్నారు. ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి పండక్కి సొంతగూటికి ఎలాగైనా చేరాలని ప్రయాణికులు ఆరాటపడుతున్నారు.

హైదరాబాద్ - విజయవాడ హైవేపై 6 ఫ్లై ఓవర్లు

- ముఖ్యంగా హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కసారిగా వాహనదారులు సొంతూళ్లకు పయనమవ్వడం ఒకకారణమైతే.. హైవే పై ప్రస్తుతం 6 ఫ్లై ఓవర్లు నిర్మాణంలో ఉండటం మరో కారణంగా తెలుస్తోంది. ఈ నిర్మాణ పనుల కారణంగానే ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు చెప్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లలో మొదటిది..

- పెద్దకాపర్తి ఏరియా ఫ్లై ఓవర్. అవుటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నంబర్ 11 నుంచి కిందకి దిగి 47.7 కిలోమీటర్లదూరం వెళ్లాక ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కనిపిస్తాయి. సుమారు 700 మీటర్ల మేర ఉంది.

- అక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో చిట్యాల ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. పైగా చిట్యాల ఊరు రోడ్డుకు ఆనుకునే ఉంటుంది. ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా పెద్దది కావడంతో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది.

- సూర్యాపేట ముందు ఖమ్మం వైపు వెళ్లడానికి ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఇక్కడ యూటర్న్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణం ఆలస్యమవుతుంది.

- ఖమ్మం ఫ్లై ఓవర్ నిర్మాణం నుంచి 5 నిమిషాలు ప్రయాణించగానే మరో ఫ్లై ఓవర్ దర్శనమిస్తుంది. అక్కడి నుంచి 1-2 కిలోమీటర్ల దూరం వెళ్లాక సూర్యాపేటలో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు కనిపిస్తాయి. ఒకటి జనగాం - సూర్యాపేటను క్రాస్ చేస్తే.. మరొకటి సూర్యాపేట చివరిలో ఉంటుంది. చిన్న ఫ్లై ఓవరే అయినా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.

- కోదాడ ముందు మరో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. దీనిని దాటితో నందిగామ వెస్ట్ బైపాస్ కు చేరుతారు. అక్కడ కూడా లింక్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

READ MORE .....

హైదరాబాద్‌ను వదిలి పల్లె భాట పట్టిన ప్రజలు

Next Story