- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌ను వదిలి పల్లె భాట పట్టిన ప్రజలు
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణకు పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కడుతున్నారు. ఏపీలో సంక్రాంతి అంటేనే అతి పెద్ద పండుగ.

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణకు పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కడుతున్నారు. ఏపీలో సంక్రాంతి అంటేనే అతి పెద్ద పండుగ. పండుగకు హైదరాబాద్ ఖాళీ అవుతుందనే విధంగా జనం ఊరి బాట పడతారు. నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, చర్లపల్లి కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. ఏ రైలు చూసినా రిజర్వేషన్ చేద్దామంటే రిగ్రెట్ కనిపిస్తోంది. ఎంజీబీఎస్, జేబీఎస్‌లో బస్టాండ్లలో రద్దీ పెరిగింది. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక జంక్షన్లు సందడిగా మారాయి. పండుగ రద్దీ దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ 6,432 స్పెషల్ బస్సులను నడిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు 1000 బస్సులను, మిగతా వాటిని తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు నడిపిస్తోంది. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నా వాటిలోనూ సీట్లు సరిపోయే పరిస్థితి లేకుండా పోయింది. ఈ బస్సులకు స్పెషల్ పేరుతో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నా... సీట్లు దొరకడం లేదని ప్రయాణికులు అంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ సైతం చార్జీలు భారీగా పెంచేసి సీట్లు బ్లాక్ చేసి దందా చేస్తున్నా అవి నిమిషాల్లో అయిపోతున్నాయి. కార్లు ఉన్న వాళ్లంతా హైవే ఎక్కి ఊరి బాట పడుతున్నారు. మరికొందరైతే బైక్స్‌పైనా విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వంటి ఊళ్లకు వెళ్తున్నారు. అంత దూరం బైక్‌పై ప్రయాణం ప్రమాదకరమే కానీ ఊరెళ్లేందుకు తమకు ఇంతకంటే వేరే దారి లేదని రాజమండ్రికి చెందిన పవన్ ‘దిశ’కు తెలిపారు.
టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూ
బస్సులు, రైళ్లలో సీట్లు దొరకక సొంత వాహనాలతో రోడ్లపైకి రావడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ ఏర్పడింది. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అవాంతరాలు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.
ఫ్రీ టోల్ లేదు
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది. పండుగ రోజుల్లో విపరీతంగా రద్దీ ఉంటుంది కనుక జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫ్రీగా ప్రకటించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకరించలేదు. జాతీయ రహదారులపై ఉచిత టోల్‌కు అనుమతి ఇవ్వలేమని చెప్పారు.
READ MORE .....
హైదరాబాద్ -విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ.. ఈ 6 ఫ్లై ఓవర్లే కారణమా?
- Tags
- Hyderabad






